హైదరాబాద్, ఆగస్టు1 (నమస్తే తెలంగాణ) : ఏదో ఒక గురుకులంలో కలుషితాహార ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. భోజనం తినలేకపోతున్నారు. శుద్ధమైన నీరు అందడమే లేదు. విపరిణామాలతో పలుచోట్ల కొన్ని సందర్భాల్లో నిద్రాహారాలనే మానేస్తున్నారు. నిత్యం అవస్థలతో కాలం వెళ్లదీస్తున్నారు. మునుపెన్నడూ లేని రీతిలో విద్యార్థులు ప్రాణాలనే కోల్పోతున్నారు. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ, మైనార్టీ, బీసీ, ఎస్టీ తదితర గురుకులాల్లో ఇలాంటి సంఘటనలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. దీనంతటికీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణంగా కనిపిస్తున్నది. క్షేత్రస్థాయిలో గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పలువురు ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సకాలంలో టెండర్ ప్రక్రియను నిర్వహించకపోవడం, నిర్వహణ బిల్లులను సకాలంలో చెల్లించకపోవడం వల్లే గురుకులాల్లో ఈ దుస్థితి దాపురించిందని వివరిస్తున్నారు.
వాస్తవంగా గురుకులాల్లో ఆహార పదార్థాలు కిరాణా సామగ్రి, పండ్లు, కూరగాయలు, చికెన్, మటన్ సరఫరా, క్యాటరింగ్, స్వీపింగ్ సేవల కోసం గతంలో ఏటా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసేవారు. మార్చి, ఏప్రిల్ నాటికి టెండర్ల ప్రక్రియను మొత్తం పూర్తి చేయడం పరిపాటి. ఫలితంగా విద్యా సంవత్సరం ఆరంభం నాటికి అన్నివిధాలా కొత్త కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉండేవారు. కానీ ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయలేదు. సంక్షేమ గురుకులాలు, వసతిగృహాల్లో నిత్యావసర సరకుల ప్రొక్యూర్మెంట్, ఇతర సరకుల సేకరణపై మార్గదర్శకాల రూపకల్పనను తీవ్ర జాప్యంచేసింది. నిత్యావసర వస్తువుల సరఫరా, సేకరణ, ధరల ఖరారు, టెండర్ ప్రక్రియపై రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎస్‌యూ) ఇటీవలే అన్ని గురుకులాలకు కామన్ గైడ్‌లైన్స్‌ను జారీచేసింది. కలెక్టర్ల నేతృత్వంలో టెండర్ ప్రక్రియను నిర్వహించాలని సూచించింది. చాలా జిల్లాల్లో ఇప్పటికీ టెండర్ ప్రక్రియనే ప్రారంభమే కాలేదు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల టెండర్లు పూర్తికావాలంటే మరో రెండు నెలల సమయమైనా పడుతుందని వివరిస్తున్నారు. నూతన టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకూ గతంలోని క్యాటరింగ్, తదితర గుత్తేదారులను కొనసాగిస్తూ ఎలాంటి ఉత్తర్వులూ జారీచేయలేదు.
టెండర్ ఖరారైన సమయంలో గుత్తేదారుల నుంచి టెండర్ విలువలో 5 శాతం చొప్పున సెక్యూరిటీ డిపాజిట్లను వసూలు చేస్తారు. టెండర్ కాలం ముగిసిన అనంతరం ఈఎండీని తిరిగి చెల్లిస్తారు. దానివల్ల గుత్తేదారులు కొంతమేరకు చెప్పుచేతల్లో ఉండేవారు. కానీ టెండర్ ప్రక్రియను పూర్తి చేయకముందే గుత్తేదారులకు ఆ సెక్యూరిటీ డిపాజిట్లను గత మే నెలలో ఎక్కడికక్కడే చెల్లింపులు చేశారు. మరోవైపు అనధికారికంగా పాత గుత్తేదారులనే కొనసాగిస్తున్నారు.
ఒక్కో గురుకులంలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పూర్తిస్థాయి విద్యార్థులంటే 8 మంది క్యాటరింగ్ సిబ్బందిని నియమించాలి. క్యాటరింగ్ సంస్థలను కూడా ఏటా టెండర్ ద్వారానే ఖరారు చేస్తారు. ఇప్పటికీ టెండర్లు ఖరారు కాలేదు. కొత్త రేట్లు, క్యాటరింగ్ నిర్వాహకులు అందుబాటులోకి రాలేదు. గతంలో క్యాటరింగ్ గుత్తేదారులకు ప్రభుత్వం దాదాపు 6 నెలల బిల్లులను విడుదల చేయలేదు. దీంతో క్యాటరింగ్ నిర్వాహకులు నిర్ణీత సంఖ్యలో మనుషులను నియమించకుండా అరకొరగానే నియమించి కాలం వెల్లదీస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని ఓ గురుకులంలో 640 మంది విద్యార్థులకు కేవలం ముగ్గురు సిబ్బందిని మాత్రమే పెట్టి వంట చేయిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అరకొర క్యాటరింగ్ సిబ్బందిపై పనిఒత్తిడి పెరిగి వంటపాత్రలను శుభ్రంగా కడగక, పరిశుభ్రత పాటించకుండా ఇష్టారీతిన వంట నిర్వహణతో మమా అనిపిస్తున్నారు. అంతిమంగా అది ఫుడ్‌పాయిజన్ ఘటనలకు దారితీస్తున్నది.
ప్రతీ గురుకులంలో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు స్వీపింగ్ సేవలను అందించే సంస్థలను కూడా టెండర్ ద్వారా ఖరారు చేస్తారు. స్వీపింగ్ సంస్థ ప్రతీ గురుకులంలో నలుగురు పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటుచేయాలి. స్వీపింగ్ సేవలకు గాను నెలకు రూ.40 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అందులో 4,500 ఫినాయిల్, తదితర స్వీపింగ్ సామగ్రి ఖర్చులు పోను మిగతా వాటిలో సిబ్బంది వేతనాలను చెల్లించాల్సి ఉంటుంది. స్వీపింగ్ సిబ్బంది నీటిట్యాంకులను, గురుకుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం తదితర పనులను నిర్వహిస్తారు. ఈ ఏడాది ఇప్పటికీ స్వీపింగ్ సిబ్బందినే నియమించలేదు. దీంతో గురుకులాల్లో ఎక్కడికక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొన్నది. నెలల తరబడి నీటిట్యాంకులను శుభ్రంచేయనేలేదు. దీంతో తాగునీరు కలుషితమై కూడా ఎక్కువగా ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నాయని గురుకుల ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు వివరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇంతటి దారుణ పరిస్థితులు నెలకొన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తున్నది. ఇకనైనా గురుకులాలపై దృష్టిసారించి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు, గురుకుల ఉపాధ్యాయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
టెండర్లు పూర్తిగాక, సెక్యూరిటీ డిపాజిట్లను చెల్లించడంతో ఆహార పదార్థాల సరఫరాదారులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. అరకొరగా, నాణ్యతలేని సరుకులనే గురుకులాలకు సరఫరా చేస్తున్నారని క్షేత్రస్థాయి ప్రిన్సిపాళ్లు వివరిస్తున్నారు. ఇదేమని అడగలేని పరిస్థితి నెలకొన్నదని వాపోతున్నారు. ఫలితంగానే గతంలో కన్నా ఎక్కువగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి ఉంటే ఈ పరిస్థితే వచ్చి ఉండేదికాదని అంటున్నారు.