హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని, ఫీజులు చెల్లించలేదన్న సాకుతో విద్యార్థుల సర్టికెట్లను ఆపరాదన్న ఉన్నత విద్యామండలి ఉత్తర్వులను పలు కాలేజీలు పట్టించుకోవడంలేదు. ఇబ్రహీంపట్నం శివారులోని గురునానక్ కాలేజీలో విద్యార్థి కాంబ్లే శంకర్ ట్రిపుల్ ఈ (EEE) పూర్తిచేశాడు. అతడికి ఏడాదికి రూ. 1.07లక్షలు ఫీజు రీయింబర్స్మెంట్ రావాల్సి ఉంది. పీజీఈసెట్ ఎంట్రెన్స్ రాయగా ఎంటెక్లో సీటు వచ్చింది. శంకర్ శనివారంలోగా సీటు వచ్చిన కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంది.
ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉండటంతో సర్టిఫికెట్లు ఇవ్వలేమని కాలేజీ నిర్వాహకులు స్పష్టంచేశారు. ఎంటెక్లో చేరాల్సి ఉంది అని వేడుకున్నా కనికరించలేదు. దీంతో బాధితుడు ఉన్నత విద్యామండలి అధికారులను సంప్రదించగా, వారు కాలేజీకి లేఖరాశారు. ఫీజు చెల్లించలేదన్న కారణంతో ఆపొద్దని, విద్యార్థికి సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించారు. ఆ లేఖను తీసుకెళ్లి కాలేజీలో సమర్పించినా ఫలితం లేకుండాపోయింది. ఆఖరుకు శుక్రవారం సాయంత్రం పూట బ్లాంక్చెక్కు, ఇద్దరు ష్యూరిటీ సమర్పిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని, అది శనివారమే ఇస్తామని కాలేజీ యాజమాన్యం చెప్పడం గమనార్హం. అధికారులు స్పందించి, న్యాయం చేయాలని శంకర్ వేడుకుంటున్నాడు. ఈ అంశంపై వివరణ కోరేందుకు గురునానక్ విద్యసంస్థ ప్రతినిధి ఒకరిని ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు.