BRS Party | బీఆర్ఎస్ రజతోత్సవం ఒక పార్టీ 25 ఏండ్ల ప్రస్థానం మాత్రమే కాదు. ఇదొక ఉద్యమ స్వప్నం.. ఒక రాష్ట్ర ఆకాంక్ష, లక్షలాది ప్రజల కలల ఫలితం. తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలను తెంచేందుకు బీఆర్ఎస్ చేసిన పోరు, ఉద్యమ రథసారథి కేసీఆర్ పోరాటపటిమ, తెలంగాణ కోసం ఆయన ప్రదర్శించిన తెగువ, తెలంగాణ సాధన, ఆ తర్వాత స్వరాష్ర్టాన్ని ప్రగతిపథంలో పయనింపజేసిన తీరు, ప్రజల జీవితాల్లో తెచ్చిన మార్పు తదితర అంశాల గురించి ఈ చరిత్రాత్మక సందర్భంలో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
తెలంగాణ ఏర్పాటును కలలో కూడా ఊహించలేని పరిస్థితుల్లో 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారు. స్వరాష్ట్ర ఏర్పాలు కలను సాకారం చేసేందుకు కేసీఆర్ కఠోర దీక్ష చేశారు. పద్నాలుగేండ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో పోరాటాలు చేశారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు. ఆటుపోట్లు ఎదురైనా ఉద్యమ కెరటమై ఎగిసెగిసి మీదికి దూకారే తప్ప, వెనకడుగు వేయలేదు. కేసీఆర్ దీక్షాదక్షతలు, విద్యార్థుల ఆత్మబలిదానాలు కలగలిసి 2014లో మూడున్నర కోట్ల మంది కలలను నిజం చేశారు. తెలంగాణ అవనిపై గులాబీ జెండా ఎగరడం బీఆర్ఎస్, కేసీఆర్ గెలుపు మాత్రమే కాదు, ప్రతి తెలంగాణ బిడ్డ గెలుపు.
తెలంగాణ సాధన అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్టాభివృద్ధికి అహర్నిశలు శ్రమించింది. ప్రగతికి పట్టం కట్టింది. రైతుబంధు, రైతుబీమా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మిషన్ భగీరథ లాంటి అనేక బృహత్తర పథకాలకు కేసీఆర్ అంకురార్పణ చేశారు. కేటీఆర్ కృషితో హైదరాబాద్ ప్రపంచ స్థాయి ఐటీ హబ్‌గా మారింది. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది.
తెలంగాణ అభివృద్ధి పథంలో నడవడంలో కేటీఆర్ పాత్ర కీలకం. ఆధునిక ఆలోచనలు, ప్రజలతో నేరుగా మమేకమవడం, ప్రజా సమస్యలను పరిష్కారం చూపడంలో పరిణతి, విశాల దృక్పథం.. అన్ని కలగలిసిన సరికొత్త రాజకీయాలకు కేటీఆర్ నాంది పలికారు. హైదరాబాద్ సహా తెలంగాణవ్యాప్తంగా మౌలిక వసతులను కల్పించి, టీఎస్ ఐపాస్ లాంటి వినూత్నమైన విధానాలను తీసుకొచ్చి అంతర్జాతీయ సంస్థలను రాష్ర్టానికి ఆకర్షించారు. ఐటీ రంగంలో భారీగా పెట్టుబడులు తీసుకొచ్చి, హైదరాబాద్‌ను గ్లోబల్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దారు. తెలంగాణ అభివృద్ధి పట్ల కమిట్మెంట్, తెలంగాణపై ఆయనకున్న అమితమైన ప్రేమ ఇందుకు ప్రేరణనిచ్చాయి.
బీఆర్ఎస్ సౌతాఫ్రికా విభాగం తరఫున తెలంగాణ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం దక్కడం నా అదృష్టం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే నాకు ఈ అవకాశం దక్కేది కాదు. ఇది పార్టీ పదవి కాదు, నన్ను నమ్మి కేసీఆర్, కేటీఆర్ నాకు అప్పగించిన బాధ్యత. నాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంతో నాకు సౌతాఫ్రికాలో ఎంతో గుర్తింపు వచ్చింది. చాలామంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఇదంతా కేసీఆర్ దయవల్లనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ రజతోత్సవ సభ ద్వారా గతం పట్ల గర్వంతో పాటు భవిష్యత్తుపై దృఢమైన నమ్మకంతో బీఆర్ఎస్ శ్రేణులు ముందుకుసాగాలి. ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ మరోసారి అధికారం చేపట్టి, కాంగ్రెస్ పాలనలో అగాథంలోకి పడిపోయిన తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెడుతుందన్న ప్రగాఢ విశ్వాసంతో మనమంతా మరో ఉద్యమానికి సిద్ధం కావాలి.
జై తెలంగాణ! జైజై బీఆర్ఎస్!!
(వ్యాసకర్త: బీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా అధ్యక్షులు)