మహబూబ్‌నగర్ : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో జిల్లాలోని రాజాపూర్ మండలం గుండ్ల పొట్లపల్లి గ్రామస్తులు కలిశారు. గుండ్ల పొట్లపల్లి గ్రామం జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్వశక్తి కరణ్ పంచాయతీ పురస్కారం క్రింద 10 లక్షల రూపాయల రివార్డ్ సాధించింది.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, వైకుంఠ ధామలు, నర్సరీలు, చెత్త తరలింపునకు ట్రాక్టర్లు, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తున్నారు.
దీంతో నేడు గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామ సర్పంచ్ డా.రాఘవేందర్ రెడ్డి ని అభినందించారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ శ్రీశైలం, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.