Harish Rao | హైదరాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చొరవతో.. జోర్డాన్‌లో చిక్కుకున్న 12 మంది గల్ఫ్ కార్మికులు వారం రోజుల్లో తెలంగాణకు చేరుకోనున్నారు. “బతుకుబండిని నడిపేందుకు, కుటుంబాలను పోషించేందుకు జోర్డాన్ వెళ్లాం. కానీ ఇప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చే మార్గమే కనిపించట్లేదు సార్.. మమ్మల్ని కాపాడండి” అని పంపిన ఒక్క వాట్సప్ మెసేజ్ వారికి దారి చూపింది. బీఆర్ఎస్ పార్టీ రూపంలో తెలంగాణకు చేరుకునేందుకు బాటలు వేసింది.
తెలంగాణ గల్ఫ్ కార్మికుల గోడును విన్న మాజీ మంత్రి హరీశ్ రావు, కేసీఆర్ ఆదేశాలతో 12 మందిని ఎలాగైనా రప్పించాలని నిశ్చయించుకున్నారు. వారి స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తన కార్యాలయానికి సూచించారు. 12 మందికి స్వయంగా తానే ఫోన్ చేసి ‘ధైర్యంగా ఉండండి ఎట్లయినా మిమ్మల్ని తెలంగాణకు తీసుకువస్తాం’ అని భరోసా ఇచ్చారు.
ఒకవైపు జోర్డాన్ గల్ఫ్ కార్మికుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా మీడియా దృష్టికి తీసుకువెళ్లిన హరీశ్ రావు, మరోవైపు బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి ద్వారా భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. ఇంకోవైపు సంబంధిత కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో పెనాల్టీ చెల్లించి వారిని తెలంగాణకు తీసుకువెళ్లవచ్చు అని కంపెనీ చెప్పగా దానికి అంగీకరించారు.
గల్ఫ్ కార్మికుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా చెల్లించాల్సిన మొత్తంతో పాటు, స్వదేశానికి రావడానికి అయ్యే విమాన టికెట్లను సైతం స్వయంగా హరీశ్ రావు భరించారు. దీంతో విమాన టికెట్ల బుకింగ్ ప్రక్రియ సైతం పూర్తయింది. మరో వారంలో నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేటలకు చెందిన 12 మంది గల్ఫ్ కార్మికులు తెలంగాణ గడ్డపై అడుగు పెట్టబోతున్నారు. సుదీర్ఘ కాలపు ఎదురుచూపుల తర్వాత వారి కుటుంబాలను కలుసుకోబోతున్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేయలేని పని, ప్రతిపక్షంలో ఉన్న హరీశ్ రావు గారు చేసి, ప్రజలకు సేవ చేసేందుకు అధికారంతో సంబంధం లేదని నిరూపించారు. 12 మంది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు.
త్వరలో స్వదేశానికి రాబోతున్నాం, కుటుంబ సభ్యులను కలుసుకోబోతున్నామని జోర్డాన్‌లో ఉన్న గల్ఫ్ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు తమ వారు సొంతూళ్లకు రాబోతున్నారని వారి కుటుంబ సభ్యులు సంతోపడుతున్నారు. ఇందుకు ఎంతగానో కృషి చేసిన హరీశ్ రావుకు ధన్యవాదాలు చెబుతున్నారు.
కేసీఆర్ పాలనలో వలసలు వాపస్.. నేడు మల్లా మొదలు: హరీశ్ రావు
కేసీఆర్ ఆదేశాలతో జోర్డాన్‌లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ గల్ఫ్ కార్మికులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలుగా ఏర్పాటు చేసాం. వారం రోజుల్లో ఇక్కడకు చేరుకుంటారు. ఇది నాకెంతో సంతృప్తిని కలిగిస్తున్నది. అభివృద్ది, సంక్షేమం సమ ప్రాధాన్యంగా సాగిన కేసీఆర్ పాలనలో వలసలు వాపస్ అయితే, రేవంతు 22 నెలల పాలనలో వలసలు మల్లా మొదలయ్యాయి. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లుగానే, గల్ఫ్ కార్మికులను సైతం కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అభయహస్తం మేనిఫెస్టోలో చెప్పిన గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమ బోర్డు ఇప్పటికీ అతీగతీ లేదు. కనీసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.