జగిత్యాల, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొన్న గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయ నం, వారికి ఆర్థిక సాయం అంశాలు అటకెక్కాయి. ఆరు నెలల కిందట వేసిన గల్ఫ్ లేబర్ వెల్ఫేర్ అడ్వయిజరీ బోర్డు ఇంతవరకు అధ్యయన ప్రక్రియనే ప్రారంభించలేదు. అధ్యయ నం కాదు కదా.. అడ్వయిజరీ బోర్డు సభ్యులు కలిసి సమావేశాలు నిర్వహించుకునేందుకు కనీసం కార్యాలయాన్ని సైతం కేటాయించలేని దుస్థితిలో రాష్ట్ర సర్కార్ ఉండటంతో గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. దాదాపు ఆరు నెలలు గడిచినా, ఒక్కసారే సమావేశాన్ని నిర్వహించడం, ఆ సమావేశానికి కీలకమైన ప్రజాప్రతినిధులు గైర్హాజరవడం, ఆరు నెలలుగా ప్ర భుత్వం కనీసం పట్టించుకోకపోవడంతో గల్ఫ్ అడ్వయిజరీ బోర్డు ఉన్నట్టా.. లేనట్టా? అని బోర్డు సభ్యులు సైతం అనుమానం వ్యక్తంచేస్తున్నారు. గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యుల మేలు కోసం ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పుకోవడం, జీవోలు జారీ చేయడం తప్ప ఏం జరగడం లేదని గల్ఫ్ కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడే మృతిచెందిన వారు, శిక్షలకు గురైన కార్మికులు, జబ్బుపడ్డ కార్మికుల పిల్లల మేలు కోసం ప్రభుత్వం గురుకులాల్లో సీట్లు కేటాయిస్తామని ప్రకటించింది. ఈ మేరకు జీవోలో సైతం గల్ఫ్ బాధిత కార్మిక కుటుంబాలకు చెందిన పిల్లలకు ఇంటర్, అవసరమైతే డిగ్రీ వరకు ఉన్న గురుకులాల్లో ఉచితంగా ప్రవేశం కల్పించే విషయాన్ని పరిశీలించాలని ఆదేశించింది. దీనిపై ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రెండు విద్యా సంవత్సరాల ప్రవేశాలు ముగిసినా, గల్ఫ్ కార్మికుల పిల్లలకు మాత్రం ఎలాంటి ప్రయోజనం కలుగలేదు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రకటించింది. గల్ఫ్ పాలసీని తీసుకువస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రూపాయి కూడా కేటాయించలేదు. గల్ఫ్ కార్మికులకు మేలు చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్ నిధులు కేటాయించకపోవడంతో గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గల్ఫ్ బాధితులు, వారి కుటుంబ సభ్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం టోల్‌ఫ్రీ నంబర్‌ను ఇచ్చి, వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపే పనిని చేపడుతుందని 205 జీవోలో పేర్కొంది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించే ప్రజావాణిలోనే ప్రవాసీ ప్రజావాణిని నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రవాసీ అంశాల కోసం ఒక ఐఏఎస్ అధికారిని కేటాయించి, గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాల నుంచి ఫిర్యాదులను తీసుకునే ప్రక్రియ ప్రారంభించారు. ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తున్నా ఇంతవరకు దానికి సి బ్బందినే నియమించలేదు. ప్రజాభవన్‌కు వచ్చే గల్ఫ్ కార్మికులు ఎక్కడ ఫిర్యాదు చేయా లో, ఎలా చేయాలో సైతం తెలియక ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది ఎవరూ లేకపోవడంతో గల్ఫ్ అడ్వయిజరీ బోర్డు సభ్యులే ప్రతి మంగళ, శుక్రవారం ప్రజాభవన్‌కు వెళ్లి ఫిర్యాదుదారులకు ఫిర్యాదు చేసే విషయంలో సహకరిస్తున్నారు.
ప్రవాసీ ప్రజావాణికి కనీసం ఇద్దరు ముగ్గురు క్లరికల్ సిబ్బందిని ఇవ్వకపోవడం, కూర్చునేందుకు కుర్చీలు సైతం వేయలేని దుస్థితి ఉండటంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇక ప్రవాసీ ప్రజావాణితోపాటు, అన్ని ప్రసార మాధ్యమాల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసి ఫిర్యాదులు ఆన్లైన్, ఫోన్ల ద్వారా స్వీకరించి, వాటిని పరిష్కరిస్తామని చెప్పిన సర్కార్ ఇంతవరకు టోల్ ఫ్రీ నంబర్‌ను సైతం ఏర్పాటు చేయకపోవడంపై గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2024 సెప్టెంబర్ 16న రాష్ట్ర ప్రభుత్వం జీవో 205 ద్వారా గల్ఫ్ కార్మికుల సం క్షేమం కోసం కొన్ని నిర్ణయాలను వెలువరించింది. 2023 డిసెంబర్ 7 తర్వాత గల్ఫ్‌లో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గల్ఫ్ కార్మికుల సమస్యలపై అధ్యయనం కోసం అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేస్తామని, గల్ఫ్ బాధిత కుటుంబాల్లోని పిల్లలకు గురుకులాల్లో సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నది. ఈ జీవో జారీ తర్వాత 2024 మార్చి 31 వరకు గల్ఫ్‌లో మృతిచెందిన 165 మంది కార్మికుల కు టుంబాలకు 5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషి యా ఇచ్చారు. 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు మంజూరు చేయలేదు. ప్రభుత్వ సాయం కోసం పలుమార్లు ప్రజాప్రతినిధులను, హైదరాబాద్‌కు వెళ్లి ప్రవాసీ ప్రజావాణిలో వినతి పత్రాలు ఇచ్చినా డబ్బులు రాలేదు. ప్రభుత్వం వరుసగా రెండు బడ్జెట్లలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రూపాయి కూడా కేటాయించలేదు.
గల్ఫ్ కార్మికుల మేలు కోసం ప్రత్యేక పాలసీ తీసుకువస్తామని చెప్పిన సర్కార్ ఈ ఏడాది ఏప్రిల్ 10న జీవో నంబర్ 57 ద్వారా గల్ఫ్ అడ్వయిజరీ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు రెండేండ్ల వ్యవధిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అధ్యయనం నిర్వహించాలని, నిపుణులతో చర్చించి, ప్రవాసీ పాలసీపై సిఫారసులను చేయాలని సూచించింది. రిటైర్డ్ ఐఎఫ్ఎస్ వినోద్‌కుమార్‌ను చైర్మన్‌గా, గల్ఫ్ కార్మికుల సమస్యలపై అవగాహన ఉన్న మంద భీమ్‌రెడ్డిని వైస్ చైర్మన్‌గా నియమించింది. అలాగే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డాక్టర్ మేడిపల్లి సత్యం, డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్‌కుమార్, మాజీమంత్రి జీవన్‌రెడ్డిని సభ్యులుగా నియమించింది. వీరితోపాటు, గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, గల్ఫ్ సంక్షేమ సంఘాల సభ్యులను ఆహ్వానితులుగా పేర్కొంది.
అడ్వయిజరీ బోర్డు ఏర్పడిన ఆరుమాసాల వ్యవధిలో ఒకే ఒక్కసారి సమావేశం నిర్వహించింది. దీనికి ప్రజాప్రతినిధుల్లో ఒక్క మాజీమంత్రి జీవన్‌రెడ్డి మినహా మరెవరూ హాజరు కాకపోవడంతో సమావేశం తూతూ మంత్రం గా నిర్వహించి చేతులు దులిపివేసుకున్నారు. అడ్వయిజరీ బోర్డుకు ఒక్క కార్యాలయం గానీ, సమావేశాలకు ఒక్క రూపాయి గానీ ప్రభుత్వం కేటాయించలేదు. అసలు కార్యాలయమే లేకుండా ఎక్కడి నుంచి విధులు నిర్వహించాలో తెలియక అడ్వయిజరీ బోర్డు చైర్మ న్, వైస్ చైర్మన్, సభ్యులు అవస్థ పడుతున్నారు. వాస్తవానికి అడ్వయిజరీ బోర్డు సభ్యు లు గల్ఫ్ కార్మికులు అధికంగా ఉన్న జిల్లాలకు వెళ్లి, కార్మికుల కుటుంబాలను కలిసి సమస్యలను అధ్యయనం చేయాలి. అలాగే, గల్ఫ్ కార్మికులు అధికంగా ఉన్న ఏపీ, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ స భ్యుల సంక్షేమం కోసం అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేయాలి.
అలాగే దుబాయ్, ఒమన్, సౌదీ లాంటి గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ కార్మికుల సమస్యలను అధ్యయనం చేసి నివేదికలు రూపొందించాలి. అలాగే దేశ, విదేశాల్లోని ప్రొఫెసర్లు, అంతర్జాతీయ అంశాలపై అవగాహన ఉన్న నిపుణలతో చర్చించి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాల్సిన గురుతర బాధ్యత అడ్వయిజరీబోర్డుపై ఉన్నది. ఈ బోర్డుకు నిధులు కేటాయించకపోవడం, కనీసం భవనం సైతం ఇవ్వకపోవడం, అధ్యయనం చేయాలని ఆదేశాలు ఇవ్వకపోవడం, సౌకర్యాలు కల్పించకపోవడంతో సభ్యులు సైతం ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తున్నారు.
ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో వ్యవసాయం తర్వాత అత్యధిక ఆదాయం వస్తున్నది గల్ఫ్ కార్మికుల నుంచే. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అంజన్న గుడి లేని ఊరు ఉంటే ఉండవచ్చు గానీ, గల్ఫ్ కార్మికుడు లేని ఊరు లేదన్నది సత్యం. లక్షలాది మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమంతో కూడుకున్న అంశాలపై ప్రభుత్వం అధ్యయనం ప్రా రంభించకపోవడం, ఎక్స్‌గ్రేషియాతోపాటు, ఇతర సౌకర్యాలు కల్పించలేని దుస్థితి నెలకొనడంపై గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ స భ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
