హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ): తొలివిడత కంటి వెలుగు పరీక్షల్లో ఘన విజయం సాధించామని, రెండో విడతలోనూ గిన్నిస్ రికార్డు సాధించేలా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. హైదరాబాద్ దోమలగూడలో ఏవీ కాలేజీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని గురువారం సీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షల వివరాలను ఆరాతీశారు. శిబిరానికి వచ్చిన వారితో ముచ్చటించి, అవసరమున్న పలువురికి రీడింగ్ గ్లాసెస్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంధత్వ నివారణే లక్ష్యంగా 2018లో నిర్వహించిన తొలి విడత కంటి వెలుగులో దాదాపు 1.57 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి 45 లక్షల మందికి కంటి అద్దాలు పంపిణీ చేశామని గుర్తుచేశారు. తొలివిడత రికార్డును అధిగమించి ఈసారి సరికొత్త రికార్డు సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మంది వైద్య సిబ్బందితో కూడిన 1,500 బృందాలు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాయని, అవసరమైన వారికి వెంటనే రీడింగ్ అద్దాలు అందజేస్తున్నారని చెప్పారు.
గతంలో నిర్వహించిన పరీక్షల్లో దూరం చూపు (లాంగ్ విజన్) ఇబ్బంది ఉన్నవారికి 15 రోజుల్లో ఆర్ఎక్స్ అద్దాలు పంపిణీ చేశామని, ఈ సారి కూడా త్వరగా అందజేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారు కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని శాంతికుమారి సూచించారు. సీఎస్ వెంట వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, హైదరాబాద్ డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకట్ తదితరులు ఉన్నారు.