హైదరాబాద్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ) : పోడు భూముల సమస్యలకు శాశ్వత ముగింపు పలికేలా మార్గదర్శకాలు రూపొందించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. పోడు భూముల సమస్యలపై శనివారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతకతో కలిసి సమీక్ష నిర్వహించారు. పోడు భూములు ఎన్ని ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి? ఎంతమందికి పోడు పట్టాల పంపిణీ జరిగింది? పోడు పట్టాలు పొందిన వారిలో అనర్హులెవరైనా ఉన్నారా? తదితర అంశాలపై కలెక్టర్లు నివేదికలు తయారుచేయాలని ఆదేశించారు. పోడు భూముల హకుల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తు ఆన్లైన్లో నమోదుకావాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, మురళీనాయక్, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్) డోబ్రియాల్, పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ఏలుసింగ్ మేరు, సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్ ఉన్నారు.
కలెక్టర్ల నేతృత్వంలో ఎఫ్ఆర్సీలు..
ఏజెన్సీ, మైదాన ప్రాంత ఎమ్మెల్యేలతో మంత్రులు సీతక, సురేఖ శనివారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెండింగ్ పోడు దరఖాస్తులను క్లియర్ చేసేందుకు కలెక్టర్ల నేతృత్వంలో అటవీ, గిరిజన శాఖలు స్థానిక ప్రజలతో అటవీ హకుల కమిటీలు(ఎఫ్ఆర్సీలు) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీడియో కాన్ఫరెన్స్లో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి శరత్, అటవీశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్లు, డీఎఫ్ఓలు, ఐటీడీఏ పీఓలు ఉన్నారు.
‘ఓవర్సీస్’కు ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ 13 వరకు గడువు
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఎస్సీ విద్యార్థులకు ఆర్థిక సాయం కోసం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్టు శనివారం ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రకటన జారీచేశారు. అక్టోబర్ 13వరకు గడువు ఉన్నట్టు పేర్కొన్నారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువగా ఉండవద్దని సూచించారు. యూఎస్ఏ, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో ఉన్నత విద్య అభ్యసించవచ్చని, అందుకు రూ.20 లక్షలు ఆర్థికసాయం అందజేస్తామని పేర్కొన్నారు. కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే అర్హులని వెల్లడించారు. గ్రాడ్యుయేషన్లో 60 శాతం మార్కులు సాధించడంతోపాటు జీఆర్ఈ/జీమ్యాట్, ఇంగ్లిష్ ప్రావీణ్యత పరీక్షలో అర్హత స్కోర్ ఉండాలని నోటిఫికేషన్లో తెలిపారు. అర్హులు https:// telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు.