Coaching Centers | హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): మోసపూరిత ప్రకటనలతో విద్యార్థులను చేర్చుకునే కోచింగ్ కేంద్రాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం సిద్ధమైంది. తప్పుడు ర్యాంకులు, ప్రకటనలతో మోసపుచ్చడం, బ్రాండింగ్ చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడే కోచింగ్ సెంటర్లపై చర్యలకు కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందిస్తున్నది. ఇందుకోసం నియమించిన కమిటీ ఈ నెల 8న తొలిసారి సమావేశమై ముసాయిదా మార్గదర్శకాలపై సమగ్రంగా చర్చించింది. వినియోగదారుల వ్యవహారాలశాఖ కార్యదర్శి రోహిత్ కుమార్‌సింగ్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, కేంద్ర విద్యాశాఖ, నేషనల్ లా యూనివర్సిటీ, ఫిట్జి, ఖాన్ గ్లోబల్ స్టడీస్, లాల్ బహద్దూర్శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. వందశాతం గ్యారెంటీ వంటి ప్రకటనలకు ఇక ఫుల్స్టాప్ పెట్టాల్సిందేనని, లేదంటే అలాంటి ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సెంటర్లపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇటీవల ఇలాంటి ప్రకటనలు ఇచ్చిన 31 కోచింగ్ ఇనిస్టిట్యూట్లపై సీసీపీఏ సుమోటోగా కేసులు నమోదు చేసింది. మరో 9 సంస్థలకు జరిమానా విధించింది.
తెలంగాణలో తప్పుడు ప్రకటనలిచ్చే కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలకు ముకుతాడువేసేందుకు ఇంటర్‌బోర్డు నిరుడు పటిష్ట చర్యలు చేపట్టింది. కాలేజీలిచ్చే అడ్వర్టయిజ్మెంట్ల పరిశీలనకు ప్రత్యేకంగా పర్యవేక్షణ కమిటీని నియమించింది. జేఈఈ, నీట్ వంటి పరీక్షల్లో ర్యాంక్ సాధించిన ఒకే విద్యార్థి తమ వాడంటూ రెండు, మూడు విద్యాసంస్థలు ప్రకటనలిచ్చుకుంటున్నాయి. క్యాటగిరీ ర్యాంకులను ఓపెన్ ర్యాంకులుగా ప్రచారం చేసుకుంటున్నాయి. దీనిపై ఫిర్యాదులందడంతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేసి, పటిష్ట నిబంధనలు పొందుపరిచారు. కాలేజీలు పత్రికలకు ప్రకటనలు ఇవ్వాలనుకుంటే ఇంటర్‌బోర్డు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రచురించడానికి ముందే ఆయా ప్రకటనలను కాలేజీలు బోర్డుకు సమర్పించాలి. కమిటీ అందులోని కంటెంట్‌ను పరిశీలించిన తర్వాతే ప్రచురణకు ముందస్తు అనుమతినిస్తుంది.