హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబరు 19 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో గుడ్డి దర్బార్ కొనసాగుతున్నది. ప్రజల సమస్యల్ని పరిష్కరించకపోగా, శాశ్వతంగా వారిని నిత్య నరకంలోకి నెట్టేందుకు బోర్డు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందులోభాగంగా 2018లో తెరవాల్సిన రోడ్లను తెరవకపోగా.. వాటిని శాశ్వతంగా మూసివేసే లక్ష్యంతో తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడం కంటోన్మెంట్, చుట్టుపక్కల ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రోడ్లను మూసివేసి ప్రజల్ని కష్టాలకు గురి చేయడం కొన్నేండ్లుగా కొనసాగుతూనే ఉన్నది.
దీనిపై పురపాలక మంత్రి కేటీఆర్ చాలా సార్లు కేంద్రంపై ఒత్తిడి తేవడంతో పాటు టీఆర్ఎస్(బీఆర్ఎస్) శ్రేణులు అనేకసార్లు ప్రత్యక్షంగా నిరసన కూడా తెలిపాయి. తాజాగా బోర్డు పరిధిలోని ఆరు రోడ్లను శాశ్వతంగా మూసివేసేందుకు కసరత్తు మొదలైనట్లుగా తెలుస్తున్నది. ఇందులో భాగంగా కంటోన్మెంట్ బోర్డు అధికారులు బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. అమ్ముగూడ, బ్యాం, ఆల్బెయిన్, ఎంపైర్, ప్రొటినీ, రిచర్డ్సన్ రోడ్లను శాశ్వతంగా మూసివేయడంపై ప్రజలు సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకు 21 రోజుల గడువు ఇచ్చారు. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి తెరచి ఉన్న రోడ్లను మూసి వేసేందుకు ప్రజల అభిప్రాయాలు తీసుకోవడం సాధారణం. కానీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధికారుల తీరు విచిత్రంగా ఉన్నది. 2018లోనే మూసిన రోడ్లను శాశ్వతంగా మూసివేసేందుకు అభిప్రాయాలు చెప్పాలంటూ నోటిఫికేషన్ జారీచేయడం విడ్డూరమని పలువురు విమర్శిస్తున్నారు.
కంటోన్మెంట్ బోర్డు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నది. ఎన్నికలు నిర్వహించకుండా బోర్డు సీఈవో, నామినేటెడ్ సభ్యుడు తీసుకొంటున్న నిర్ణయాలివి. రోడ్ల మూసివేతను ప్రజలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కొత్తగా వారి నుంచి భిన్నాభిప్రాయం ఏదీ రాదన్న విషయం అందరికీ తెలుసు. కానీ నోటిఫికేషన్ జారీ, అభిప్రాయ సేకరణ అనేది తూతూమంత్రంగా నిర్వహించి, రోడ్లను శాశ్వతంగా మూసివేయాలని కుట్ర చేస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నోరు విప్పాలి. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న బోర్డు నిర్ణయాలపై పోరాటం కొనసాగిస్తాం.
– క్రిశాంక్, టీఎస్ఎండీసీ చైర్మన్