హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఓటర్లు అభివృద్ధి, సంక్షేమానికే మొగ్గు చూపుతున్నారు. తమ గతాన్ని మార్చి.. భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న వారికే పట్టం కడతామంటున్నారు. స్వచ్ఛజలంతో గొంతు తడిపి, ఫ్లోరైడ్‌ను బండకేసి కొట్టిన వారెవరో? బీడు భూములను ఆకుపచ్చగా మార్చి పంటచేలను పండుగ చేసింది ఎవరో తమకు తెలుసని చెప్తున్నారు. స్వార్థం కోసం ఎన్నిక తెచ్చిందెవరో? వేల కోట్ల కాంట్రాక్టుల కోసం తమ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టిందెవరో మునుగోడుకు తెలిసిపోయింది. ‘కారే రావాలి.. సారే గెలవాలని జనం దృఢ నిశ్చయానికి వచ్చారు. ‘మీరు ఏ పార్టీ వాళ్లో కానీ.. మా మతిల ఉన్నది.. మీకెందుకు చెప్పాలి?’ అని అంటూనే ‘ఇంతకంటే ఇంకెవలు చేస్తరు?’ అని మనసులో మాట బయటపెడుతున్నరు. నాలుగేండ్ల కింద నమ్మి ఓట్లేస్తే ‘ఉన్నకాడ ఉండక కోట్లకు పడగలెత్తాలని పోయిండు. ‘పోయినోడు సుట్టం కాదు.. ఆపదొస్తే ఆదుకోడు’ అని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీరుపై మండిపడుతున్నారు.
‘టైం వచ్చినప్పుడు ఏం చేయాల్నో గదే చేస్తం’ అని పత్తిచేలల్లో పనిచేస్తున్న మహిళా రైతులు, కూలీలు తెగేసి చెప్తున్నరు. ‘అన్నం పెట్టేవాళ్లకు సున్నం పెట్టం.. ముసలోళ్లకు.. ముడిగోళ్లకు.. మొగుడు సచ్చినోళ్లకు.. నెలనెలా పింఛన్లు ఇస్తున్నడు.. పిల్లపెండ్లికి లచ్చ రూపాలిస్తుండు.. బాలింత ఎచ్చాలకు.. తొల్సూరు.. మల్సూరు అని సూడకుంట దవాఖాన్లన్ల పైసలిత్తాండు. ఇంటింటికీ నల్లానీళ్లు.. రైతుబంధు వస్తున్నది. అదాట్న రైతు చస్తే ఐదు లచ్చలు ఇస్తాండు.. ఇంకేం కావాలయ్యా? అని జవాబిస్తున్నారు.
మునుగోడులో అఖండ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీఆర్ఎస్ శ్రేణులకు సీపీఐ, సీపీఎం కార్యకర్తలు, నాయకులు అండగా నిలుస్తున్నారు. బీజేపీని నిరోధించడమే లక్ష్యంగా మందుకు సాగుతున్నారు. అసత్యాల బీజేపీని, రాజగోపాల్‌రెడ్డిని ఎక్కడికక్కడ కట్డడిచేయడంలో పోరాట పటిమను ప్రదర్శించారు. ప్రచారంలో గ్రామ, మండల, మున్సిపాలిటీ స్థాయిలో టీఆర్ఎస్, వామపక్ష శ్రేణులు కలిసి నడిచాయి.
బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి అసత్యప్రచారాలపై మునుగోడు మండిపడుతున్నది.‘రాజగోపాల్‌రెడ్డి పోయిందే అమ్ముడు.. పైనుంచి నీతులా?’ అని ఓటర్లు ఎద్దేవా చేస్తున్నారు. మాట్లాడితే కుటుంబ పాలన అంటడు.. వాళ్ల అన్న వెంకట్‌రెడ్డి ఎంపీగా లేడా? రాజగోపాల్‌రెడ్డి భార్య ఎన్నికల్లో పోటీచేయలేదా?’ అని ప్రశ్నిస్తున్నారు. గెలిపిస్తే ఏం చేశావని, ఇప్పుడే మొహం పెట్టుకొని వచ్చావని అనేక గ్రామాల్లో నిలదీశారు. మునుగోడు ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టుపెట్టిన ద్రోహి అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి సర్వే సంస్థలతోపాటు బీజేపీ, ఆరెస్సెస్ సర్వేలు రాజగోపాల్‌రెడ్డికి మూడో స్థానమేనని తేల్చినట్టు సమాచారం.
ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచే టీఆర్ఎస్ ప్రచారంలో దూకుడు పెంచింది. ఇంటింటి ప్రచారంతోపాటు కుల సంఘాల వారీగా నిర్వహించిన సామూహిక సమావేశాలు పార్టీకి కలిసివచ్చాయి. టీఆర్ఎస్ ప్రచార వ్యూహం ఫలించదని క్షేత్రస్థాయిలో నెలకొన్న వాతావరణం స్పష్టం చేస్తున్నది. టీఆర్ఎస్ నేతలు ప్రజల్లో కలిసిపోయారు. ‘పెద్దపెద్ద లీడర్లు.. టీవీలల్ల కనిపించే లీడర్లు మా ఇంటికి వచ్చి మంచిగ పలుకరిస్తున్నరు. కష్టసుఖాలు ఇసారిస్తున్నరు’ అని ఓటర్లు చెప్తున్నారు. ‘నాలుగేండ్లు పట్టించుకోలేదు కానీ.. ఇప్పుడు వచ్చి.. అది చేస్తా ఇది చేస్తా.. వెయ్యి కోట్లతోని మునుగోడును బాగుచేస్తా’ అని చెబితే ఎవలు నమ్ముతరు అని చండూరు మండలం ఇడికూడ గ్రామ సర్పంచ్ నల్లా లింగయ్యయాదవ్ ప్రశ్నించారు.
నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపుతోనే సాధ్యమని మునుగోడు ఓటర్లు భావిస్తున్నారు. ‘గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే ఎట్టా..?’, గోవులాంటి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ఓడించి గొడ్డలి లాంటివాణ్ని (రాజగోపాల్‌రెడ్డిని) గెలిపిస్తే ఏం జరిగింది?’ అని సీఎం కేసీఆర్ బంగారిగడ్డలో చేసిన వ్యాఖ్యలు బాగా ప్రభావితం చేస్తున్నాయి. చండూరును రెవెన్యూ డివిజన్ చేయటమే కాకుండా మర్రిగూడలో 100 పడకల దవాఖాన, నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలను కలుపుతూ రోడ్నెట్వర్క్ను అభివృద్ధి చేస్తామనే సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానంపై స్థానికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొంటానని చేసిన వాగ్దానం నియోజకవర్గంలోని కౌన్సిలర్లు, ఎంపీటీసీ, సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీల్లో భరోసాను నింపింది. ఇంటింటికీ నీళ్లు ఇచ్చి దూపతీర్చిన కేసీఆర్ వెంటే తాము ఉంటామని మహిళలు స్పష్టంచేస్తున్నారు. ‘కండ్లముందట నీళ్లు కనిపిస్తున్నయ్. ఇంటింటికీ నల్లా కనిపిస్తున్నది. రైతుబంధు తీసుకున్న రైతుల్లో సంతోషం కనిపిస్తున్నది. 67 ఏండ్లలో ఇంతకన్నా గొప్పగా చేసిన మొనగాడు ఎవరున్నరు?’ అని జలసాధన సమితి నాయకుడు దుశ్చర్ల సత్యనారాయణ ప్రశ్నించారు.