హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): వస్తు, సేవల పన్ను వసూళ్లకు సంబంధించిన ఉత్తర్వులపై దాఖలయ్యే అప్పీళ్ల విచారణకు హైదరాబాద్‌లో ఏర్పాటైన అప్పిలేట్ ట్రిబ్యునల్ (జీఎస్టీఏటీ) బెంచ్ నుంచి బుధవారం నుంచి పనిచేయనున్నది. ఈ ధర్మాసనంలో ముగ్గురు జడ్జిలను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో సభ్యుడిని నియమించాల్సి ఉన్నది. జ్యుడీషియల్ సభ్యులుగా సుశీల్ కుమార్ శర్మ, ఏపీ రవి, టెక్నికల్ సభ్యునిగా డాక్టర్ డీకే శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు.
వీరంతా నాలుగేండ్లపాటు ఆ బాధ్యతల్లో కొనసాగుతారు. జీఎస్టీ ట్రిబ్యునల్‌గా ఇప్పటివరకు కమిషనర్లే వ్యవహరిస్తున్నారు. జీఎస్టీ అప్పీళ్లను ఇంతవరకు హైకోర్టు విచారించింది. ఇకపై వాటిని అప్పిలేట్ ట్రిబ్యునల్ విచారిస్తుంది. జీఎస్టీఏటీ ప్రధాన ధర్మాసనం ఢిల్లీలో ఉన్నది. హైదరాబాద్‌లో ట్రిబ్యునల్ భవన నిర్మాణాలు ఇంకా పూర్తికాలేదు. అవి పూర్తయ్యే వరకు ట్రిబ్యునల్ తాతాలికంగా జీఎస్టీ కార్యాలయంలో పనిచేస్తుంది.