రామగిరి, నవంబర్ 20: కేంద్రంలోని మోదీ సర్కార్ కార్మిక హక్కులను కాలరాస్తున్నదని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. నల్లగొండలోని పద్మానగర్‌లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రథమ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేనేత వస్ర్తాలపై విధించిన జీఎస్టీని తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేశారు.
చేనేత కార్మికుల పనిగంటలు తగ్గించి, పనికి తగిన వేతనాలు పెంచాలన్నారు. యజమానులు తగిన వసతులు కల్పించి బీమా సౌకర్యం కల్పించాలని సూచించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని కోరారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ముషం రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్, గంజి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.