హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ)/జగిత్యాల: చేనేత రంగంపై విధించిన జీఎస్టీని వెంటనే తొలగించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ గురువారం లేఖ రాశారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన తన లేఖ ద్వారా రాష్ట్రపతికి తెలియజేశారు. 2017లో ముడి సరుకులపై విధించిన 5 శాతం జీఎస్టీ, ఇప్పుడు చేనేత ఉత్పత్తులపై పెంచిన 18 శాతం జీఎస్టీ వల్ల లక్షలాది చేనేత కుటుంబాల జీవనోపాధి దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు.
ఈ పన్ను పెంపు నిర్ణయం చేనేత కార్మికులతో సంప్రదింపులు లేకుండానే జరిగిందని, ఇది వారి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత రంగం భారతీయ సంస్కృతి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైనదిగా అభివర్ణించారు. చేనేతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కార్మికులను భాగస్వాములను చేయాలని కోరారు. హ్యాండ్లూమ్ బోర్డును పునరుద్ధరించాలని ఆయన రాష్ట్రపతిని అభ్యర్థించారు. ఈ అంశంపై రాష్ట్రపతి జోక్యం చేసుకొని, వేలాది కుటుంబాలను రక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.