హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): ఆర్థిక రంగంలో తెలంగాణ ప్రబల శక్తిగా ఎదుగుతున్నది. చిన్న రాష్ట్రం అయినప్పటికీ కేవలం తొమ్మిదేండ్లలోనే అనేక పెద్ద రాష్ర్టాలను వెనక్కినెట్టి గణనీయ వృద్ధిరేటును నమోదు చేస్తున్నది. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా.. సొంతకాళ్లపై నిలబడి ఏటికేడు ఆదాయ మార్గాలను పెంచుకుంటున్నది. సీఎం కేసీఆర్ పటిష్ట ప్రణాళికలతో తెలంగాణ ఆర్థిక ముఖచిత్రం అనూహ్యంగా మారిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి భారీగా పెరిగి, వ్యాపారాల వృద్ధి తదితర కారణాలతో రాష్ట్రంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు అనూహ్యంగా పెరిగాయి. కేంద్రం జీఎస్టీని ప్రవేశపెట్టిన 2019-20 ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు నెలల్లో (ఏప్రిల్, మేలో) మొత్తం రూ.2,938 కోట్ల వసూళ్లు సాధించిన రాష్ర్టానికి ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు నెలల్లో ఏకంగా రూ.7,430 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇది ఐదేండ్ల క్రితం నాటి కంటే 153 శాతం, నిరుటి కంటే 20 శాతం అధికం. దశాబ్దాల చరిత్ర కలిగి, వాణిజ్య రంగంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్న అనేక పెద్ద రాష్ర్టాల్లో నమోదైన వృద్ధిరేటు కంటే ఇది ఎంతో ఎక్కువ. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక వనరుల అభివృద్ధిపై దృష్టి సారించింది. అనేక కొత్త వాణిజ్య పన్నుల శాఖ సర్కిళ్ల ను ఏర్పాటు చేసింది. ప్రతిస్థాయిలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది. మాన్యువల్ నోటీసులు, ప్రొసీడింగ్ల జారీని పూర్తిగా తొలగించింది. పరిశోధనలు, విశ్లేషణల కోసం ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్లను ఏర్పాటు చేసింది. తద్వారా ప న్ను రాబడులను గణనీయంగా పెంచుకుంటూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.