హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): ప్రీలాంచ్ పేరుతో 31 మందిని మోసగించి రూ.60 కోట్లు కాజేసిన జీఎస్ఆర్ ఇన్ఫ్రా ఎండీ గుంటపల్లి శ్రీనివాసరావును సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు ముందు ఆయన పోలీసుల దృష్టి మళ్లించేందుకు సెల్‌ఫోన్‌ను డ్రైవర్‌కు ఇచ్చి, ఏపీలోని పలు ప్రాంతాల్లో తిప్పాడు.
సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు డ్రైవర్‌ను పట్టుకున్నారు. చివరికి శ్రీనివాస్‌ను అరెస్టు చేసి, గురువారం కోర్టులో హాజరుపర్చారు. శ్రీనివాసరావును పీటీ వారెంట్‌పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కూడా కస్టడీలోకి తీసుకొనే అవకాశాలున్నాయి.