వేములవాడ, మే 14: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎదిగిన కొడుకును కాపాడుకునేందుకు ఆ నిరుపేద కుటుంబం తల్లడిల్లింది. చేసేది చిన్నాచితక వ్యాపారమే అయినా తనయుడిపై ప్రేమతో శక్తికి మించి అప్పులుచేసి ఆఖరిదాకా పోరాటం చేసింది. ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా రూ.కోటి ఖర్చు పెట్టి మూడు నెలలపాటు చికిత్స చేయించినా ప్రాణం దకకపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన వేములవాడలో విషాదాన్ని నింపింది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన పన్యాల రాజు-రాణి దంపతులు కొన్నేండ్లుగా వేములవాడ పట్టణంలోని సుబ్రహ్మణ్యంనగర్లో చిరువ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. చిన్న కుమారుడు శ్రీచరణ్ (18) బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. గత ఫిబ్రవరి 10న బైక్ సర్వీసింగ్ కోసం కరీంనగర్ షోరూమ్‌కు వెళ్లి తిరిగివస్తుండగా ఉజ్వలపారు సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ దవాఖానకు తరలించగా, అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ దవాఖానలో చేర్పించారు. దాదాపు మూడు నెలలుగా దవాఖానలోనే ఉన్న శ్రీచరణ్‌కు వైద్యులు మూడుసార్లు తలకు శస్త్ర చికిత్స చేశారు. ఇందుకోసం రూ.కోటికిపైగా వెచ్చించినా నయం కాలేదు. సోమవారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందాడు. కొడుకు కోసం శక్తికి మించి అప్పు చేసినా.. కండ్ల ముందే కాలం చేయడంతో ఆ కుటుంబ సభ్యులు భోరునవిలపించారు.