మహదేవపూర్/కాళేశ్వరం, జూన్ 10 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌లో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను భారీ నీటిపారుదల శాఖ ఈఈ తిరుపతిరావు సోమవారం పరిశీలించారు. బరాజ్‌లోని ఏడో బ్లాక్‌లో కుంగిన 19, 20, 21వ పియర్ల వద్ద గ్రౌటింగ్, డౌన్ స్ట్రీమ్‌లో సీసీ బ్లాక్‌ల రీ అరేంజ్మెంట్ పనులను నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
బరాజ్‌లో ఏడో బ్లాక్‌లోని 21 గేట్ ఎత్తేందుకు వీలుకాకపోవడంతో ఆర్క్ గ్రౌటింగ్ పరికరంతో కట్ చేశారు. ముక్కల తొలగింపు ప్రక్రియ ముగిశాక 20వ గేట్ కటింగ్ పనులు ప్రారంభించనున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బరాజ్‌లో లోపాలపై అధ్యయనానికి సీఎస్ఎంఆర్ఎస్ నిపుణుల బృందం ఆధ్వర్యంలో చేపట్టిన పరిశోధనలు కొనసాగుతున్నాయి.
ఇందులో భాగంగా కుంగిన ప్రాంతంలో యంత్రాలతో డ్రిల్లింగ్ చేసి నమూనాలు సేకరిస్తున్నారు. అలాగే అన్నారం (సరస్వతీ) బరాజ్‌లో ఎన్డీఎస్ఏ సూచనల మేరకు సీపేజ్‌లో సాయిల్ టెస్టు పనులు ప్రారంభమయ్యాయి. బరాజ్‌లోని 35వ గేట్ వద్ద 25 మీటర్ల లోతు వరకు బోర్ వేస్తూ ప్రతి మూడు మీటర్లకు ఒక టెస్ట్ చేస్తున్నారు.
అలాగే సాయిల్ పెనట్రేషన్ టెస్ట్ (ఎస్పీటీ) చేస్తున్నారు. ఒక గేట్ వద్ద ప్రతి టెస్ట్‌కు నాలుగు రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. బరాజ్‌లో 35, 28, 38, 44వ గేట్ల వద్ద టెస్టులు చేయాల్సి ఉన్నదని చెప్పారు. సాయిల్ (మట్టి) శాంపిల్‌ను పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్ ల్యాబ్‌కు పంపించనున్నామని, వచ్చే నివేదిక ఆధారంగా పనులు చేపడతామని
వారు పేర్కొన్నారు.