హైదరాబాద్: గ్రూప్-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను టీజీపీఎస్సీ (TGPSC) పరిశీలించనుంది. మంగళవారం నుంచి హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ (Certificate Verification) నిర్వహించనుంది. ఈ ప్రక్రియ నవంబర్ 26 వరకు కొనసాగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీశీలన జరుగనుందని టీజీపీఎస్సీ వెల్లడించింది. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్ధులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు 2 జిరాక్స్ సెట్లు కూడా తమతోపాటు తీసుకురావాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్ల జాబితాను టీజీపీఎస్సీ ఇప్పటికే www.tgpsc.gov.in వెబ్సైట్లో ఉంచింది. వెరిఫికేషన్‌కు ఏ రోజు, ఏ షెడ్యూల్లో హాజరు కావాలనే పూర్తి వివరాలను అందుబాటులో ఉంచినట్లు కమిషన్ కార్యదర్శి ప్రియాంక వెల్లడించారు. అభ్యర్థులు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం హాజరు కావాలని సూచించారు.
కాగా, కమిషన్ పేర్కొన్న తేదీలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాని అభ్యర్థుల అభ్యర్థిత్వం తదుపరి ప్రక్రియకు పరిగణించబడదని స్పష్టం చేశారు. వెరిఫికేషన్‌కు హాజరైన వారికి సంబంధించి ఏవైనా పెండింగ్‌లో ఉన్న పత్రాలు ఉంటే, వాటిని నవంబర్ 29 (రిజర్వ్ డే) సాయంత్రం 5 గంటల తర్వాత అంగీకరించబడవని వెల్లడించారు.
కాగా, మొత్తం 1388 గ్రూప్-3 పోస్టులకు టీజీపీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి 2024 నవంబర్ 17, 18 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.67 లక్షల మంది హాజరయ్యారు. దాదాపు ఏడాది తర్వాత వీటి ఫలితాలు కమిషన్ వెల్లడించింది. పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్టును మార్చి 14న విడుదల చేసింది. ఇటీవల ఈ పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాను విడుదల చేసిన తెలిసిందే.