హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తనను పెయిడ్ ఆర్టిస్ట్ అని సోషల్ మీడియాలో కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై గ్రూప్ 2 అభ్యర్థి సింధు ఘాటుగా స్పందించారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పెయిడ్ ఆర్టిస్ట్ అని ట్రోలింగ్ చేస్తారా? అని నిలదీశారు. ఈ మేరకు శనివారం ఒక వీడియో విడుదల చేశారు.
‘ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇప్పుడు తనను శంకిని అని అంటున్నారు.. అదే టీజీపీఎస్సీ సమస్యలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాట్లాడాను.. నాడు ఆయనకు శంకినిగా కనబడలేదా?’ అని సింధు ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తమకు సంబంధించిన నోటిఫికేషన్స్ గురించి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొట్లాడామని గుర్తుచేశారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్లు తనను కొన్నారా? అని ప్రశ్నించారు. అప్పుడు తనను ఎందుకు పెయిడ్ ఆర్టిస్ట్ అనలేదని నిలదీశారు.
పెయిడ్ ఆర్టిస్ట్ అనే వాళ్లు తాను ఏ పార్టీ కండువా అయినా కప్పుకున్నట్టు నిరూపిస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఆడబిడ్డను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఆ రోజు ప్రతి ఒక కాంగ్రెస్ నాయకుడు తాము ఎకడుంటే అకడికి వచ్చి మమ్మల్ని నమ్మండి.. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మంచిగా చేస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకొని మోసం చేశారని సింధు విమర్శించారు.