Telangana | హైదరాబాద్, జూలై13 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి : మొన్న తలకుమాసినోళ్లే ఆందోళన చేస్తున్నరని, నేడు ఏ పరీక్ష రాయనోళ్లు.. ఏ ఉద్యోగానికి పోటీపడనోళ్లు దీక్షలు చేస్తున్నరని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు భగ్గుమన్నారు. ‘రాజకీయ పార్టీల ప్రోద్బలంతోనే ధర్నాలు చేస్తున్నారు.. నిరసన తెలిపేటోళ్లంతా అభ్యర్థులు కాదు’ అని మాట్లాడడంపై మండిపడుతున్నారు.
‘కొన్ని రాజకీయశక్తులు, కొచింగ్ సెంటర్ల యాజమాన్యాలే పరీక్షల వాయిదా కోరుతున్నయ్. నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తం.’ అంటూ జేఎన్టీయూ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిందారోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ అభ్యర్థులు రోడ్డెక్కారు. గ్రూప్స్ పోస్టులు పెంచాలని, గ్రూప్-1మెయిన్స్‌లో 1:100 విధానం అమలు చేయాలని, గ్రూప్-2తోపాటు డీఎస్సీ వాయిదా వేయాలని కొద్దికాలంగా ఉద్యమిస్తున్నా పట్టించుకోకుండా నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని మొండికిపోవడంపై కన్నెర్రజేశారు.
సీఎం వ్యాఖ్యలకు నిరసనగా అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్తోపాటు, ఇతర అనేక చోట్ల వేలాది మంది ఉద్యోగార్థులు రోడ్డెక్కారు. కాంగ్రెస్ సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. అభ్యర్థుల ధర్నాలతో ఎక్కడికక్కడ గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. మరోవైపు భారీగా పోలీసులు మోహరించి అభ్యర్థులను పంపిచేందుకు యత్నించినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది.
గ్రూప్ 2 పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి జేఎన్టీయూ వేదిగాక శనివారం సాయంత్రం ప్రకటించారు. ఆ వెంటనే గంటల వ్యవధిలోనే నిరుద్యోగులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు పెంచడంతో పాటు డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి అశోక్‌నగర్ చౌరస్తాలో వేలాదిమంది సంఖ్యలో నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగారు. పెద్దఎత్తున రాస్తారోకో చేశారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్‌నగర్ చౌరస్తా వరకూ భారీ ర్యాలీ తీశారు. చౌరస్తాలోనే రోడ్డుపైనే బైఠాయించారు. రాత్రి 9గంటల నుంచి అర్ధరాత్రి వరకూ అక్కడే రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.నిరుద్యోగుల దీక్షలపై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. ‘ సీఎం డౌన్ డౌన్ ’ అంటూ అభ్యర్థులు చేసిన నినాదాలతో అశోక్‌నగర్ దద్దరిల్లిపోయింది. ‘ఇదేమి లెక్క.. గుంపు మేస్త్రీ లెక్క’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు తామంతా కృషిచేశామని, తమ బాధను అర్థం చేసుకుని ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లను అంగీకరించాలని డిమాండ్ చేశారు.

అశోక్‌నగర్‌లో గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల అభ్యర్థులు ధర్నాకు దిగిన సమాచారం తెలుసుకున్న డీఎస్సీ అభ్యర్థులు క్షణాల్లో దిల్‌సుఖ్‌నగర్‌లో ధర్నాకు దిగారు. వెంకటాద్రి థియేటర్ నుంచి మెట్రో స్టేషన్‌వరకు ర్యాలీ తీశారు. రాజీవ్‌చౌక్‌లో ధర్నాకు దిగారు. డీఎస్సీని తక్షణమే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. “వుయ్ వాంట్ జస్టిస్.. కాంగ్రెస్ డౌన్ డౌన్.. సీఎం డౌన్ డౌన్’ అంటూ నినదించారు. తమ సమస్యను రాజకీయ కోణంలో చూడవద్దని, రాష్ట్ర భవిష్యత్ దృష్టిలో చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయమైన డిమాండ్లతో తాము చేస్తున్న ధర్నాలను బీఆర్ఎస్, బీజేపీలతో అంటగట్టి రాజకీయం చేయడం సమంజసం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దిల్‌సుఖ్‌నగర్‌తో పాటు ఎల్బీనగర్లోనూ అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో పోలీసులు భారీగా మోహరించారు.

నిరుద్యోగుల మెరుపు ధర్నాతో అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ రూట్లలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటల తరబడి వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. మరోవైపు అశోక్‌నగర్‌లో ఏసీపీ రమేశ్ ఆధ్వర్యంలో దోమలగూడ, ముషీరాబాద్ పీఎస్‌లతోపాటు, అదనపు సీఆర్పీఎఫ్ బలగాలు రోడ్లపై మోహరించాయి. నిరుద్యోగులను బలవంతంగా పంపించేందుకు యత్నించాయి. అయినా అభ్యర్థులు తమ డిమాండ్లు నెరవేర్చేదాకా కదిలేది లేదని రోడ్లపైనే భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో అర్ధరాత్రి దాటినా పరిస్థితి అదుపులోకి రాలేదు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై నిరుద్యోగులు మెరుపు ధర్నాకు దిగిన సమయంలోనే ఓ అభ్యర్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అశోక్‌నగర్ ధర్నాలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం మొర్రవానిగూడెం గ్రామానికి చెందిన అభ్యర్థిని మడకం నిత్యమైత్ర పాల్గొన్నది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆవేదనకు గురై వెంటతెచ్చుకున్న గోలీలు మింగి రోడ్డుపైనే పడిపోయింది. సహచర అభ్యర్థులు వెంటనే గాంధీ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ ఏఎంసీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అభ్యర్థిని కిందపడిపోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల మొర ఆలకించాలి. సీఎం రేవంత్‌రెడ్డికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్న. భేషజాలకు పోకుండా గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను చర్చలకు పిలిచి, డిమాండ్లను అర్థం చేసుకొనే ప్రయత్నం చేయండి. వారిని రెచ్చగొట్టేలా, కించపరిచేలా మాట్లాడి అభాసుపాలు కాకండి. వారు ధైర్యం కోల్పోయేలా వ్యవహరించకండి. పోలీసు బలగాలు, లాఠీలు, ఇనుప కంచెలు, బారికేడ్లతో విద్యార్థుల పోరాటాన్ని అణచివేసే ప్రయత్నం ఫలించదు. అది మరింత ఉధృతంగా మారతుంది. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను ఇబ్బందిపెట్టినా, భౌతికదాడులకు పాల్పడినా మేము చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
– తన్నీరు హరీశ్‌రావు, మాజీ మంత్రి
రేవంత్‌రెడ్డి రాష్ర్టానికి అబద్ధాలు చెప్తున్నారు. నిరుద్యోగులను కించపరుస్తున్నారు. మోతీలాల్ నాయక్ 2024 జూన్‌లో జరిగిన గ్రూప్-1 పరీక్ష రాసిండు. అతడు గ్రూప్-2, 3, 4 పరీక్షలకు దరఖాస్తు కూడా చేసుకున్నడు. అతడు సోషల్ మీడియాలో పెట్టిన హాల్‌టికెట్లే ప్రత్యక్ష సాక్ష్యం. నిరుద్యోగ యువకుల సమస్యలు పరిష్కరించకుండా సీఎం రేవంత్‌రెడ్డి కవ్వింపు చర్యలకు దిగడం దారుణం.
– మన్నె క్రిశాంక్, బీఆర్ఎస్ నాయకుడు
ఏ పరీక్షకు అపె్లై చేసిండని రాహుల్‌గాంధీ ఆ రోజు అశోక్‌నగర్ వచ్చి నిరుద్యోగుల గురించి మాట్లాడిండు. రేవంత్‌రెడ్డీ నువ్వు ఏ పరీక్షకు అపె్లై చేసినవ్ అని ఆ రోజు దీక్ష చేసినవ్. నిరుద్యోగ యువతను చులకన చేసి, అవహేళన చేస్తూ రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరు ఆయన అహంకారానికి నిదర్శనం. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బీఆర్ఎస్వీ తీవ్రంగా ఖండిస్తున్నది. వెంటనే డీఎస్సీ, గ్రూప్-2, 3 పరీక్షలు వాయిదా వేయాలి.
-తుంగ బాలు, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
గ్రూప్-2 పోస్టులు పెంచి పరీక్షలు డిసెంబర్లో నిర్వహించాలి. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. కష్టం వచ్చింది మాకు.. మేము నిరసనలు తెలుపుతుంటే మా వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయనడం పద్ధతికాదు. నిరుద్యోగులమైన మేము స్వతహాగా ఆందోళన చేస్తున్నాం.
– నరసింహ, అభ్యర్థి
నిరుద్యోగులను కించపరిచేలా సీఎం మాట్లాడడం సరికాదు. నిరుద్యోగులపై వివక్ష చూపుతున్నారు. గ్రూప్-1, డీఎస్సీలానే గ్రూప్ 2,3 పోస్టులు పెంచాలి. గ్రూప్స్ పరీక్షలు డిసెంబర్లో పెట్టాలి.
– సుధీర్, అభ్యర్థి
పదేండ్లలో గ్రూప్-2 ఎగ్సామ్ ఒకేసారి జరిగింది. గ్రూప్-1,3 పరీక్షలు జరగలేదు. గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి ప్రిపరేషన్ కోసం సమయమివ్వాలి. ఈ సమస్యను రాజకీయ కోణంలో చూడొద్దు. రాష్ట్ర భవిష్యత్ దృష్టితో చూడాలి.
– శ్రీకాంత్ రెడ్డి, అభ్యర్థి