హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ నెల 9న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీని గురువారం టీజీపీఎస్సీ విడుదల చేసింది. వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది. టీజీపీఎస్సీ ఐడీ, హాల్టికెట్ నంబర్, పుట్టినరోజు వివరాలు నమోదు చేసి, ప్రాథమిక కీని ఓపెన్ చేసుకోవచ్చు. మాస్టర్ ప్రశ్నపత్రం కూడా అందుబాటులో ఉంచారు. ఈ నెల 17 సాయంత్రం 5 గంటల వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఇంగ్లిష్లో స్వీకరించనున్నారు. ఇతర భాషలో వచ్చిన అభ్యంతరాలు, ఈ-మెయిల్, వ్యక్తిగతంగా వచ్చే అభ్యంతరాలను స్వీకరించే ప్రసక్తేలేదని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ స్పష్టంచేశారు. అభ్యంతరాలను పూర్తి ఆధారాలతో సహా అధికారిక వెబ్సైట్లో పొందుపరచాలని ఆయన సూచించారు.