హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా సాగింది. రాష్ట్రంలోని 1,019 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగింది. 503 ఉద్యోగాలకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,42,954 మంది మాత్రమే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకొన్నారు. ఆదివారం 2,86,051 మంది పరీక్ష రాయగా, 25 శాతం మంది హాజరు కాలేదు. ప్రశ్నపత్రాలను అభ్యర్థుల ముందే ఓపెన్ చేశారు.
టీఎస్పీఎస్సీలో కమాడ్ కంట్రోల్
గ్రూప్-1 ప్రిలిమ్స్ కోసం టీఎస్పీఎస్సీ అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి టీఎస్పీఎస్సీ కమాం డ్ కంట్రోల్ సెంటర్ నుంచే మానిటరింగ్ చేసింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ జనార్దన్‌రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ ఇక్కడి నుంచే పర్యవేక్షించారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేశారు. ప్రిలిమ్స్ బయోమెట్రిక్‌తో సరిపోలితేనే మెయిన్స్‌కు అభ్యర్థులను అనుమతించనున్నారు. 8 రోజుల్లో ఓఎంఆర్ షీట్లను www.tspsc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
10.15లోపే 99 శాతం మంది
గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. కొత్తగా బయోమెట్రిక్ నిబంధన తేవడంతో 10.15 గంటలలోపే పరీక్ష కేంద్రంలోకి అనుమతించాం. మొద టి రోజు నుంచి అభ్యర్థులకు అవగాహన కల్పించడంతో 10.15 గంటల లోపే 99 శాతం మంది వచ్చేశారు. పరీక్ష సజావుగా సాగేందుకు కృషి చేసిన జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఏడీఎల్లు, ఆర్డీవోలు, తాసిల్దా ర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ ఆఫీసర్లకు అభినందనలు. పారదర్శకత కోసం ఓఎంఆర్ షీట్లు టీఎస్సీపీస్సీ వెబ్సైట్లో పెడతాం. వెంటనే కీ విడుదల చేస్తాం. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే తెలపవ చ్చు. నిపుణుల కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరిలోనే నిర్వహిస్తాం.
– బీ జనార్దన్ రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్