ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వెంటనే ఆ నోటిఫికేషన్ను రద్దు చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశారు. గ్రూప్ 1లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోతీలాల్ మాట్లాడుతూ గతంలో పరీక్షా సమయంలో బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని, పేపర్ లీక్ అయిందని ఆరోపణలకే టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు రద్దు చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఆధారాలతో సహా అక్రమాలను బహిర్గతం చేస్తున్నా నోటిఫికేషన్ ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు వేర్వేరుగా హాల్ టికెట్లు ఎందుకు జారీ చేశారని నిలదీశారు. 1:1 ప్రకారంగా విడుదల చేసిన తుది జాబితాలోని మెయిన్స్, ప్రిలిమ్స్ హాల్టికెట్ నంబర్లు విడుదల చేయాలని కోరారు. యూపీఎస్సీలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నింటికీ ఒకే హాల్టికెట్ ఉంటుందని గుర్తు చేశారు.
కోఠి మహిళా కళాశాలలోని పరీక్షా కేంద్రం 18, 19 (మహిళ అభ్యర్థుల ప్రత్యేక పరీక్షా కేంద్రం)లో పరీక్ష రాసిన వారికి అన్ని ర్యాంకులు ఎలా వచ్చాయని, ఈ పరీక్షకు లింగ ఆధారిత పరీక్షా కేంద్రాలు లేవని చెప్పారు. 654 మందికి ఒకే ర్యాంకు, అది కూడ ఒకరి వెనకాల ఒకరు కూర్చున్న వాళ్లకు ఎలా వస్తాయో టీజీపీఎస్సీ అధికారులకే తెలియాలని ఎద్దేవా చేశారు. ఉర్దూ మీడియంలో మొత్తం తొమ్మిది మంది పరీక్ష రాస్తే అందులో ఏడుగురికి 450 కి పైగా మార్కులు రావడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గత నెల 13న విడుదల చేసిన ప్రకటనలో యూనివర్సిటీల్లోని రెగ్యులర్ ఫ్యాకల్టీ తో మూల్యాంకనం చేయించామని పేర్కొన్నారని, 2004 లో పదవీ విరమణ చేసిన ఫ్యాకల్టీ పంజల నరసయ్య, 2022లో పదవీ విరమణ చేసిన ఫ్యాకల్టీ వన్నెల రమేశ్ ఏ యూనివర్సిటీకి చెందిన వారో అధికారులే చెప్పాలని సవాల్ విసిరారు. జవాబు పత్రాలను ప్రైవేటు కోచింగ్ సెంటర్ల ఫ్యాకల్టీతో మూల్యాంకనం చేయించినట్టుగా సందేహం కలుగుతున్నదని పేర్కొన్నారు. మూల్యాంకనం చేసిన వారి పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్చేశారు. మీడియం వారీగా ఎంపిక చేసిన వారి జాబితాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ సందేహాలను నివృత్తి చేయకుండా ఉద్యోగ భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెయ్యి మందితో ఢిల్లీలో ధర్నా చేస్తామని హెచ్చరించారు.