TGPSC | హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : మోకాలికి.. బోడిగుండుకు లింకుపెట్టిన చందంగా ఉంది టీజీపీఎస్సీ వ్యవహారం. అభ్యర్థుల్లో ఉన్న అనుమానం ఒకటైతే.. టీజీపీఎస్సీ ఇచ్చిన వివరణ మరోలా ఉంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది మొర్రో.. తెలుగుమీడియం వారికి తక్కువ మార్కులేసి.. ఇంగ్లిష్‌మీడియం వారికి ఎక్కువ మార్కులేశారంటూ అభ్యర్థులు ఆరోపిస్తుంటే టీజీపీఎస్సీ ఇలాంటి సందేహాలకు సరైన వివరణ ఇవ్వకుండా సంబంధంలేని సమాధానాలిచ్చింది. టీజీపీఎస్సీ మెయిన్స్ మూల్యాంకనంపై గురువారం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 20,161 మంది ఫలితాలను వెల్లడించగా, ఇంగ్లిష్ మీడియంలో 12,323, తెలుగుమీడియంలో 7,829, ఉర్దూ మీడియంలో 9 మంది చొప్పున అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రాసినట్టు తెలిపింది. ఇదేం వివరణో తెలియని పరిస్థితి. తెలుగు మీడియం వారికి వచ్చిన మార్కులెన్ని.. ఇంగ్లిష్ మీడియం వారికి వేసిన టాప్ మార్కులేంటో వెల్లడించాల్సి ఉండగా, అభ్యర్థుల సంఖ్యను కమిషన్ బయటపెట్టింది. 100లోపు, 500 లోపు మీడియంవారీగా టాపర్ల వివరాలను కమిషన్ ఎందుకు వెల్లడించలేదని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
గ్రూప్-1 ఫలితాల వెల్లడి నేపథ్యంలో టాపర్ల వివరాలను టీజీపీఎస్సీ ప్రకటించలేదు. కేవలం అభ్యర్థుల లాగిన్ ఐడీతో ఎవరికి వారుగా సొంతంగా మార్కులు తెలుసుకునే అవకాశం ఇచ్చింది. టాపర్ల వివరాలపై ఆరా తీస్తే ఇప్పుడే ఇవ్వలేం.. రీ కౌంటింగ్ తర్వాత వివరాలిస్తామని కమిషన్ చెప్పింది. మరోవైపు రీకౌంటింగ్‌కు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుండగా గురువారం టాప్-100లో 59 మంది పురుషులు, 41 మంది మహిళలు ఉన్నట్టు వెల్లడించింది. టాప్-500లో 296 పురుషులు, 204 మహిళలున్నట్టు ప్రకటించింది. కులాలవారీగా వివరాలను సైతం కమిషన్ ప్రకటించింది. ఒక వేళ రీ కౌంటింగ్ తర్వాత మార్కుల్లో తేడాలుంటే ఈ వివరాలన్నీ మారిపోయే అవకాశమున్నది. ఇలా ఎలా ప్రకటిస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.