Group-1 | హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్-1 ఫలితాలపై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పారదర్శకంగా పేపర్లను దిద్దించలేదని.. తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని బాధిత అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అనుభవం లేని అధ్యాపకులచే పేపర్లను దిద్దించి.. అన్యాయం చేశారని టీజీపీఎస్సీపై మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రూప్-1 పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ జరిపించాలని గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్-1 మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి 18 రకాల సబ్జెక్టులుంటే.. 12 రకాల సబ్జెక్ట్ నిపుణులతోనే పేపర్లను దిద్దించారని పేర్కొన్నారు. మూడు భాషల్లో పరీక్షలు జరిగినా తగిన నిపుణులతో పేపర్లను దిద్దించలేదన్నారు. ఒకే మీడియంలో నిపుణులైన వారితో తెలుగు, ఇంగ్లీష్ మీడియం పేపర్లను మూల్యాంకనం చేయించారు. దీంతో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని పిటిషనర్లు పేర్కొన్నారు.
పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం.. టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది కోర్టు. పిటిషన్పై తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. గ్రూప్-1 జీఆర్ఎల్ను టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే.