అక్కడ రిసెప్షన్ జరుగుతోంది. అతిథులందరూ హాజరయ్యారు. నూతన వధూ, వరులు వేదికపైకి వచ్చారు. అదే సమయంలో పోలీసులతో కలిసి ఓ మహిళ ఎంటరయ్యింది. వారిని చూసిన వెంటనే వరుడు జంప్ అయ్యాడు. ఎంత వెదికినా ఆచూకీలేదు. సినిమాను తలపించే ఈ సంఘటన మాదన్నపేటలోని మొయిన్నాగ్లో జరిగింది.
మాదన్నపేటలోని మొయిన్నాగ్లో సయ్యద్ నజీర్ రెండో పెళ్లి రిసెప్షన్ జరుపుకుంటున్నాడు. అదే సమయంలో అతడి మొదటి భార్య పోలీసులతో రిసెప్షన్ వద్దకు వచ్చింది. సయ్యద్ తన రెండో వివాహం గురించి మొదటి భార్య డాక్టర్ సనా సమ్రీన్‌కు చెప్పలేదు. దీంతో ఆమె పోలీసులను వెంటపెట్టుకుని రావడంతో నజీర్ భయాందోళనలకు గురయ్యాడు. రిసెప్షన్ వేదిక వెనుక ద్వారం నుంచి జారుకున్నాడు.
సనా మాట్లాడుతూ, తన భర్త తన అనుమతి లేకుండా వివాహం చేసుకుంటున్నాడని తెలిసి సోదరుడు అబ్దుల్ వహీద్, సంతోష్‌నగర్ పోలీస్ అధికారులతో కలిసి వచ్చానని చెప్పింది. తన భర్త డబ్బుల కోసం వేధించాడని, తాము నిరాకరించడంతో వేధించడం మొదలెట్టాడని తెలిపింది. దీంతో సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు వెల్లడించింది. అప్పటినుంచి దూరం ఉంటున్నట్టు తెలిపింది. ఇప్పుడు చెప్పకుండా మరో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి వస్తే..చూసి పారిపోయాడని పేర్కొంది. ఈ విషయమై బాధిత మహిళ మళ్లీ ఇప్పుడు సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఇప్పటికీ నజీర్ ఆచూకీ తెలియలేదు.