ఇచ్చోడ, ఏప్రిల్ 10 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే)లో గురువారం నిర్వహించిన ఓ పెండ్లిలో వధూవరులు ప్లకార్డు పట్టుకుని వినూత్నరీతిలో నిరసన తెలిపారు. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్లకార్డు ద్వారా కల్యాణలక్ష్మి పథకంలో ఇస్తానన్న తులం బంగారం ఏమైందంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెండ్లయిన ప్రతి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతున్నా ఇవ్వడంలేదని విమర్శిస్తూ నూతన వధూవరులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. పెండ్లి అయిన ప్రతి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇవ్వాలని వధూవరులు కాంబ్లే ఆమోల్ – గీతాంజలి, వారి తల్లిదండ్రులు కోరారు.