Grok AI | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ) : జీవ వైవిధ్యానికి, పచ్చదనానికి ఆలవాలమైన హెచ్‌సీయూ భూముల్లో రేవంత్ ప్రభుత్వం సాగించిన దమనకాండపై యావత్తు దేశం ఒక్కటై నినదించింది. అర్థరాత్రి పూట గుట్టుచప్పుడు కాకుండా మూగజీవాలపై ఉరికిన వందలాది బుల్డోజర్లను భారతావని ముక్తకంఠంతో నిరసించింది. ఐదు రోజులుగా కొనసాగుతున్న వనమేధంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం రేవంత్ ప్రభుత్వంపై కన్నెర్రజేసింది. ఈ క్రమంలో అసలు హెచ్‌సీయూలో ఏం జరిగింది? పచ్చటి ప్రకృతిని చెరబట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? హెచ్‌సీయూలో మంటలు రేపి రేవంత్ సర్కారు సాధించిందేంటి? ఈ వివాదంపై రాహుల్ ఎందుకు స్పందించట్లేదు? డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా రేవంత్ ఈ వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చారా? పర్యావరణ పరిరక్షణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? కేసీఆర్ సర్కారు అడవులను ఎలా సంరక్షించింది? అంటూ నెటిజన్లు అడిగిన ప్రశ్నలన్నింటికీ ‘గ్రోక్’ సవివరంగా సమాధానాలు ఇచ్చింది.
ప్రశ్న : హెచ్‌సీయూ ఉద్యమానికి కారణమేంటి? అక్కడ ఏం జరుగుతున్నది?
గ్రోక్ : హెచ్‌సీయూలోని 400 ఎకరాల భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించాలన్న రేవంత్ ప్రభుత్వ నిర్ణయం వల్లే అక్కడ విద్యార్థుల ఉద్యమం చెలరేగింది. సర్కారు నిర్ణయంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ చర్యలతో ఈ భూముల్లోని జీవ వైవిధ్యం దెబ్బతింటుందని, జీవాలు ఆవాసాన్ని కోల్పోతాయని, హైదరాబాద్‌కు ఊపిరితిత్తులుగా ఉన్న వందల ఏండ్లనాటి వృక్షాలు నేలకొరగడం మంచిదికాదంటూ పర్యావరణ ప్రేమికులు, విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. మార్చి 30న మొదలైన నిరసనలను అణిచివేయడానికి పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జీ చేశారు. అడ్డొచ్చిన వారిని ఈడ్చుకెళ్లారు. బీఆర్ఎస్ వంటి పార్టీలు, విద్యార్థి సంఘాలు హెచ్‌సీయూ విద్యార్థులకు సంఘీభావాన్ని ప్రకటించాయి.
ప్రశ్న : బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడవుల సంరక్షణ కోసం ఏ చర్యలు తీసుకొంది?
గ్రోక్ : అడవుల పరిరక్షణతోపాటు పునరుద్ధరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. కేసీఆర్ హయాంలో మొదలుపెట్టిన తెలంగాణకు హరితహారం ద్వారా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 24 శాతం నుంచి 33 శాతానికి పెంచాలని నిర్ణయించారు. 2023 నాటికి దాదాపు 200 కోట్ల మొక్కలు నాటారు. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలను వినియోగించారు. అటవీ సంరక్షణ బాధ్యతను పౌరుల్లోనూ పెంచడానికి గ్రామ సమితులను ఏర్పాటు చేశారు.
ప్రశ్న : రేవంత్ సర్కారు వైఖరి వల్ల హెచ్‌సీయూలో వన్యప్రాణులకు ఎలాంటి నష్టం వాటిల్లుతున్నది?
గ్రోక్ : హెచ్‌సీయూలోని పచ్చటి భూముల్లో రేవంత్ సర్కారు బుల్డోజర్లతో సృష్టిస్తున్న విధ్వంసం వల్ల ఈ ప్రాంతంలో నివసిస్తున్న నెమళ్లు, జింకలు, ఇండియన్ స్టార్ టార్టాయిస్ వంటి అరుదైన జీవాలు ఆవాసాలను కోల్పోయాయి. వందల ఏండ్లనాటి వృక్షాలు ఇప్పటికే నేలకొరిగాయి. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా 2008-09లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం హెచ్‌సీయూలోని ఈ ప్రాంతంలో 455 కంటే ఎక్కువ రకాల జీవ, వృక్ష జాతులు ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడు అవన్నీ ప్రమాదంలో పడినట్టే. భూమి చదును చేయడంతో అక్కడి నీటి వనరులపై కూడా ప్రభావం పడుతుంది.
ప్రశ్న : హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటానికి దేశవ్యాప్తంగా స్పందన ఎలా ఉంది?
గ్రోక్ : హెచ్‌సీయూ భూముల విషయంలో రేవంత్ ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా హెచ్‌సీయూ విద్యార్థులకు జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ, జాదవ్‌పూర్ యూనివర్సిటీల్లోని విద్యార్థి సంఘాలు సంఘీభావాన్ని ప్రకటించాయి. ‘సేవ్ హెచ్‌సీయూ’ బ్యానర్లతో బెంగళూరులో విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీలు నిర్వహించాయి. బీఆర్ఎస్తో పాటు పలు పార్టీలు విద్యార్థుల ఉద్యమానికి అండగా నిలిచాయి. ‘సేవ్ హెచ్‌సీయూ’, ‘సేవ్ హెచ్‌సీయూ ల్యాండ్’, ‘ఐస్ ఆన్ హెచ్‌సీయూ’ హ్యాష్‌ట్యాగ్‌లతో దేశవ్యాప్తంగా నెటిజన్లు పెద్దఎత్తున సోషల్ క్యాంపెయిన్ నడిపారు. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఈ క్యాంపెయిన్‌కు 4.67 లక్షల మంది మద్దతు తెలిపారు. ది హిందూ, ఇండియాటుడే, ది వైర్ వంటి జాతీయ మీడియా సంస్థలు కూడా ప్రముఖంగా కవరేజీ ఇచ్చాయి. అయితే, స్థానికంగా ఉన్న కొన్ని మీడియా సంస్థలు ఈ ఉద్యమాన్ని ఓ రాజకీయ ప్రేరేపిత చర్యగా అభివర్ణించాయి. కాగా హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలతో హెచ్‌సీయూ భూములపై రేవంత్ సర్కారు చర్యలు నిలిచిపోయాయి. మొత్తంగా హెచ్‌సీయూ ఉద్యమం దేశవ్యాప్తంగా విద్య, పర్యావరణం, ప్రజాస్వామ్య హక్కులపై ఓ చర్చను తీసుకొచ్చి, జాతీయ సమస్యగా మారింది.
ప్రశ్న : హెచ్‌సీయూ ఘటనపై ప్రముఖులు ఎలా స్పందించారు?
గ్రోక్ : రాజకీయ, సినీప్రముఖుల నుంచి పర్యావరణవేత్తల వరకు అందరూ హెచ్‌సీయూ వివాదంపై రేవంత్ సర్కారును తప్పుబట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ బుల్డోజర్ రాజకీయాలను వ్యతిరేకించారు. సినీస్టార్స్ రష్మిక, సమంత, రేణూదేశాయ్, శ్రీలీల, వరలక్ష్మీ శరత్‌కుమార్, రష్మీ గౌతమ్, పర్యావరణవేత్తలు దీపా మెహతాతో పాటు కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేసే సోషల్‌మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ ధ్రువ్‌రాఠీ కూడా రేవంత్ చర్యలను తప్పుబట్టారు. ప్రకృతి విధ్వంసంలో కాంగ్రెస్, బీజేపీ దొందు దొందేనని ఓ వీడియోలో ఎండగట్టారు.
ప్రశ్న : రేవంత్ ప్రభుత్వం హెచ్‌సీయూ భూములను ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నది?
గ్రోక్ : హెచ్‌సీయూలోని సదరు భూమి కంచ గచ్చిబౌలిలో ఉన్నది. వాణిజ్యపరంగా అది ఎంతో విలువైన ప్రాంతం. అక్కడి భూముల రేట్లు ఆకాశాన్నంటుతాయి. ఆ భూమిని అమ్మితే ప్రభుత్వానికి ఆర్థిక లాభం చేకూరుతుందన్న ఉద్దేశంతోనే రేవంత్ సర్కారు హెచ్‌సీయూ భూములను తీసుకోవాలని అనుకుంటున్నది. హెచ్‌సీయూలోని ఆ భూమి విలువ రూ. 10,000-రూ. 15,000 కోట్ల మేర ఉంటుందని అంచనా.
ప్రశ్న : హెచ్‌సీయూ వివాదంపై రాహుల్ ఎందుకు స్పందించట్లేదు?
గ్రోక్ : ముంబయిలోని ఆరే ఫారెస్ట్, ఛత్తీస్‌గఢ్‌లోని హాస్దేవ్ ఫారెస్ట్ విషయంలో వెంటనే స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హెచ్‌సీయూ వివాదంపై స్పందించకపోవడానికి రాజకీయ కారణాలు ఉండొచ్చు. గతంలో 2016లో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకొంటే రాహుల్ రెండుసార్లు హెచ్‌సీయూలో పర్యటించారు. అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండటమే దీనికి కారణం. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో తమ పార్టీకి చెడ్డపేరు రావొద్దనే ఆయన స్పందించడంలేదన్న వాదనలు ఉన్నాయి. హెచ్‌సీయూ విషయంలో రాహుల్ ద్వంద్వ వైఖరిని చూపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ప్రశ్న : హెచ్‌సీయూ వివాదంపై కోర్టులు తాజాగా ఏమన్నాయి?
గ్రోక్ : హెచ్‌సీయూలో రేవంత్ ప్రభుత్వం చేపడుతున్న పనులను నిలిపివేయాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చాయి. ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది.
ప్రశ్న: హెచ్‌సీయూ వివాదం వల్ల రేవంత్ ప్రభుత్వం ఏం సాధించింది?
గ్రోక్ : ఈ వివాదం వల్ల రేవంత్ ప్రభుత్వం సాధించినదానికంటే కోల్పోయిందే ఎక్కువగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం తమ చర్యలతో ప్రజావ్యతిరేకతను మూటగట్టుకొన్నది. రాజకీయ ఒత్తిడి వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నది. కోర్టుల ఆగ్రహానికి గురైంది. సర్కారుకు మొత్తంగా హెచ్‌సీయూ వివాదం సమస్యాత్మకంగా మారింది.
ప్రశ్న : డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే రేవంత్ ప్రభుత్వం హెచ్‌సీయూ వివాదాన్ని తెరమీదికి తీసుకొచ్చిందా?
గ్రోక్ : ప్రతిపక్ష నేతలు, విద్యార్థులు, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే రేవంత్ ప్రభుత్వం హెచ్‌సీయూ వివాదాన్ని తెరమీదకు తీసుకొచ్చిందని కూడా చెప్పొచ్చు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వివాదం, గ్యారెంటీల అమలులో వైఫల్యం, రైతు ఆత్మహత్యలు, నీటి గోస, ఆర్థిక సంక్షోభం, గ్రూప్-1 ఫలితాల వివాదం నుంచి దృష్టిమరల్చడానికే కాంగ్రెస్ సర్కారు హెచ్‌సీయూ వివాదాన్ని తీసుకొచ్చిందంటూ పలువురు విమర్శించడం కనిపిస్తున్నది. రాత్రికి రాత్రి బుల్డోజర్లను హెచ్‌సీయూ భూముల్లోకి పంపడాన్ని చూస్తే, ఇది కొంతవరకు నిజమేనని పలువురు చెప్తున్నారు.
ప్రశ్న : హెచ్‌సీయూ భూములపై బీఆర్ఎస్ స్పందన ఏంటి?
గ్రోక్ : హెచ్‌సీయూ భూముల విషయంలో రేవంత్ ప్రభుత్వ తీరును బీఆర్ఎస్ మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ విషయంలో ఆ పార్టీ నేతలు కేటీఆర్, కవిత విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు.