e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home టాప్ స్టోరీస్ లేఅవుట్లలోనూ ప్రకృతి వనాలు

లేఅవుట్లలోనూ ప్రకృతి వనాలు

  • నల్లగొండ జిల్లాలో వినూత్న ప్రయోగం
  • వెంచర్లలో స్థలాల స్వాధీనం.. విరివిగా మొక్కల పెంపకం
  • 13 మండలాల్లో 31 చోట్ల అమలు
  • స్వాగతిస్తున్న ప్రజలు

నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ప్రకృతి వనాల పెంపులో నల్లగొండ జిల్లా అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకా రం చుట్టారు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో సామూహిక అవసరాల కోసం కేటాయించే 10 శాతం స్థలాల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఇప్పటివరకు మొత్తం 13 మండలాల్లోని వెంచర్లలో 31 చోట్ల ప్రకృతి వనాలను పెంచుతున్నారు. గతేడాది ప్రారంభించిన చోట్ల ఇప్పటికే చెట్లు ఏపుగా పెరిగి ఆహ్లాదకర వాతావరణాన్ని పంచుతున్నాయి. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా వెంచర్లను గుర్తించడంలో అధికారులు నిమగ్నమయ్యారు.

పది శాతం భూమిని కాపాడుతూ..
వెంచర్లలో లేదా ఇప్పటికే ఉన్న కాలనీలను లేఅవుట్‌ చేసే సమయంలో నిబంధనల ప్రకారం 10 శాతం భూమిని ఖాళీగా వదిలేయాల్సి ఉంటుంది. దీన్ని స్థానిక సంస్థలకు స్వాధీనపరచాలి కూడా. కానీ కొన్నిచోట్ల గతంలో ఇలా వదిలేసిన ఖాళీ స్థలాల్లో తిరిగి ఏదో ఒక పేరుతో రియల్‌ వ్యాపారులే పాగా వేయడం లేదా అక్రమంగా విక్రయించడం జరిగేది. దీంతో వెంచర్లలో ఖాళీ స్థలాలు అందుబాటులో ఉండటంతో లేదు. ఇలాంటి వ్యవహారాలకు అవకాశం లేకుండా చెక్‌ పెడుతూ నల్లగొండ కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రకృతి వనాలు పెంచుతున్నారు.

- Advertisement -

31 వెంచర్లలో ప్రకృతి వనాల ఏర్పాటు
నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు 13 మండలాల్లోని 25 గ్రామ పంచాయతీల్లో 31 రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో ప్రజల అవసరాల కోసం వదిలిన ఖాళీ స్థలాలను గుర్తించారు. చట్టప్రకారం ఆ స్థలాలు ప్రభుత్వపరం చేశాక ప్రకృతి వనాల పెంపుపై దృష్టిసారించారు. పల్లె ప్రగతి కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల ద్వారా ఈ స్థలాలకు చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. అనంతరం ఇందులో వివిధ రకాల పండ్లు, పూలు, ఔషధ మొక్కలతోపాటు ఏపుగా పెరిగే నీడనిచ్చే చెట్లను పెద్ద ఎత్తున నాటుతున్నారు. గతేడాది సెప్టెంబర్‌ నుంచి దీనికి శ్రీకారం చుట్టారు. ముందుగా నార్కట్‌పల్లి, చిట్యాల మండలాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. ప్రస్తుతం ఆయా మండలాల్లోని వెంచర్లలోని ప్రకృతి వనాలు ఏపుగా పెరిగాయి. వీటిని నిత్యం గ్రామ పంచాయతీ పాలకవర్గాలు సంరక్షిస్తుండటంతో ఆహ్లాదకర వాతావరణానికి మారుపేరుగా నిలుస్తున్నాయి.

జిల్లా అంతటా విస్తరణకు చర్యలు..
వెంచర్లలో ప్రకృతి వనాల పెంపును జిల్లా వ్యాప్తంగా చేపట్టేందుకు అధికారులు ఖాళీ స్థలాలను గుర్తించే పనిలో పడ్డారు. కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ నేతృత్వంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, డీపీవో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో మండలం చొప్పున స్వాధీనం చేసుకుంటూ మంచి పురోగతి సాధిస్తున్నారు. హరితహారంలో దీన్ని కూడా ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకుని పనిచేస్తున్నామని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు. దీంతో వెంచర్లలోని ప్రజోపయోగ స్థలాలను సంరక్షించినట్టు అవుతుందన్నారు. అధికారులు ప్రత్యేకంగా చేపట్టిన ఈ కార్యక్రమంపై సామాన్యుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పర్యావరణ ప్రేమికులు సైతం అధికారుల కృషిని అభినందిస్తున్నారు.

కృషి ఫలిస్తున్నది..
వెంచర్లలో పల్లె ప్రకృతి వనాల పెంపు విషయంలో మా కృషి ఫలిస్తున్నది. ఆయా స్థలాల్లో పచ్చని చెట్లతో పల్లె పార్కులు కళకళలాడుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే 31 వెంచర్‌ స్థలాల్లో చెట్ల పెంపకం చేపట్టాం. హరితహారంలో మరిన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం.

  • విష్ణువర్ధన్‌రెడ్డి, డీపీవో, నల్లగొండ

మంచి వాతావరణం ఏర్పడింది..
నార్కట్‌పల్లి పరిధిలోని వెంచర్లలో కేటాయించిన స్థలాల్లో మొక్కలు నాటి ప్రకృతి వనాలు ఏర్పాటు చేశాం. మొక్కలు నాటడం వల్ల వెంచర్‌లో ఇండ్లు కట్టుకున్న వారికి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. పాలకవర్గ తీర్మానాలతో వెంచర్లలో మొక్కల నాటింపు పనులను ముమ్మరం చేశాం.

  • దూదిమెట్ల స్రవంతి, సర్పంచ్‌, నార్కట్‌పల్లి
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement