Greenko | హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ‘బోడిగుండుకు మోకాలుకు ముడిపెట్టడం’ అన్నట్టుగా ఫార్ములా-ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది.. చేయిస్తున్నది. ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థలు సైతం కనీస ఇంగిత జ్ఞానం ఉపయోగించకుండా కథనాలను వండివార్చేందుకు పోటీ పడుతున్నాయి. ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు.. ఫార్ములా-ఈ రేసు జరిగిన తేదీలను పరిశీలిస్తే కాస్త విషయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా ‘లబ్ధి లేదు.. లంచం లేదు’ అని స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రభుత్వం చేస్తున్నది దుష్ప్రచారమని తేలిపోతుంది.
బాండ్ల వెనుక అసలు చరిత్ర..
గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు కలిసి బీఆర్ఎస్ బాండ్లను కొనుగోలు చేశాయని ప్రభుత్వం ఆరోపిస్తున్నది. వాస్తవానికి రాజకీయ పార్టీలకు గోప్యంగా విరాళాలు ఇచ్చేలా ‘ఎలక్టోరల్ బాండ్ల’ పద్ధతిని ఎన్డీయే ప్రభుత్వం 2018 జనవరి మొదటివారంలో ప్రారంభించింది. 2024 జనవరిలో అవి రద్దయ్యాయి. ఆలోగా దేశవ్యాప్తంగా 28,030 బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.16,518 కోట్లు. ఇందులో రూ.12వేల కోట్లకుపైగా ఆయా పార్టీల ఖాతాల్లో చేరాయి.
ఫార్ములా -ఈ తెరమీదికి ఇలా..
ఎలక్ట్రిక్ కార్ రేసును హైదరాబాద్‌లో నిర్వహించాలని 2021 డిసెంబర్లో ఫార్ములా-ఈ సంస్థకు ప్రతిపాదనలు అందాయి. 10వ సీజన్ రేసును నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఫార్ములా-ఈ మధ్య 2022 జనవరి 17న ఒప్పందం జరిగింది. హైదరాబాద్‌ను ఎంపిక చేస్తూ ఫార్ములా-ఈ చీఫ్ కో ఫౌండర్ ఆల్బర్టో లాంగో, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్, ఈవీ డైరెక్టర్ సుజయ్ కారంపురి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 2022 అక్టోబర్‌లో ఫార్ములా-ఈ, రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్ కో సంస్థల మధ్య ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగింది. ఫార్ములా-ఈ రేసు 2023 ఫిబ్రవరి 11న మొదలైంది.
క్విడ్ ప్రో కో ఎక్కడిది..
సాధారణంగా క్విడ్ ప్రోకో గానీ, ఇంకా ఏదైనా అవినీతి జరగాలంటే.. ఏదైనా సంస్థకు లాభం చేకూర్చి, అందులో వాటా కింద కొంతమేర లంచంగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా-ఈపై చర్చలు జరిగే సమయానికిగానీ, ఒప్పందాలు చేసుకున్నప్పుడుగానీ గ్రీన్ కో అనే సంస్థకు బీఆర్ఎస్తో సంబంధం లేదు. ఆ సంస్థ బీఆర్ఎస్ బాండ్లు కొనుగోలు చేసిన ఆరు నెలల తర్వాత ఫార్ములా-ఈ స్పాన్సర్షిప్ ఒప్పందం చేసుకున్నది. 10 నెలల తర్వాత రేసు జరిగింది. ఒప్పందం చేసుకున్న తర్వాత బాండ్లు కొనుగోలు చేస్తే అవినీతి జరిగిందన్న వాదనకు అర్థం ఉంటుందని, ముందుగానే కొనుగోలు చేయడం అవినీతి ఎలా అవుతుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పైగా బీఆర్ఎస్ బాండ్లు కొనుగోలు చేసిన సమయంలోనే బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ బాండ్లను సైతం గ్రీన్కో కొనుగోలు చేసిందని, మరి అన్ని పార్టీలతోనూ క్విడ్ ప్రోకో జరిగినట్టేనా అని ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ, కాంగ్రెస్‌దే మేజర్ వాటా..
2018 జనవరి నుంచి 2024 జనవరి మధ్య దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 28,030 బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేశారు. రూ.12వేల కోట్లకుపైగా పార్టీల ఖాతాల్లో చేరాయి. ఇందులో బీజేపీకి రూ.6,500 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.1300 కోట్ల వరకు బాండ్ల రూపేణా సమకూరినట్టు చెప్తున్నారు. దాదాపు 340 కంపెనీలు కాంగ్రెస్ బాండ్లను కొనుగోలు చేశాయని అంటున్నారు. ఈ లెక్కన కాంగ్రెస్‌కు 340 కంపెనీలతో క్విడ్ ప్రో కో జరిగిందా? అని ప్రశ్నిస్తున్నారు. అన్ని రాష్ర్టాలకు చెందిన ఏసీబీలు కాంగ్రెస్ అధ్యక్షుడిపై విచారణ జరపాలా? అని నిలదీస్తున్నారు.