హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): స్వర్గాన్ని నక్షత్రాల్లో వెతకడం కాకుండా.. మన చేతుల్లో ఉన్న ఈ పచ్చని భూగోళాన్ని కాపాడుకొంటే.. అంతకు మించిన స్వర్గం మరొకటి ఉండదని ప్రముఖ భారత వ్యోమగామి శుభాంశు శుక్లా పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత అందమైన, జీవించడానికి, శ్వాసించడానికి అనువైన ఆకుపచ్చని గ్రహం భూమి అని, అలాంటిది మనుషుల తప్పిదాల వల్ల కాలుష్యమయంగా మారుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. బెంగళూరులో ఇటీవల జరిగిన ఇన్నోవేషన్ సమ్మిట్-2026లో శుభాంశు శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రోదసిలో ఇరవై రోజుల తన అనుభవాలను పంచుకున్నారు.
పర్యావరణ మార్పుల నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకోవాలని, మొక్కలను నాటడం ద్వారా పర్యావరణ సవాళ్లను అధిగమించవచ్చని చెప్పారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇగ్నైటింగ్మైండ్స్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ కృషి చేస్తున్నదని ప్రశంసించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం కోట్లాది మొక్కలను నాటిందని, కోట్లాది పౌరులను భాగస్వాములను చేసిందని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యత అని గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం నిరూపించిందని పేర్కొన్నారు.
భూమిని కాపాడుకోవడమే సవాల్
మనిషి ఎదురొంటున్న ముఖ్యమైన సవాళ్లు అంతరిక్షాన్ని జయించడం కాదని, తాను నివాసముంటున్న భూమిని కాపాడుకోవడమని శుభాంశు శుక్లా పేర్కొన్నారు. ప్రాణానికి అతి ముఖ్యమైన గాలి, నీరు, నేల, పచ్చని ప్రకృతి కలిగిన గ్రహం మనకు తెలిసినంత వరకు భూమి ఒకటేనని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో వాతావరణ మార్పులు వేగంగా సంభవిస్తున్నాయని, వీటితోపాటు నీటికొరత, జీవవైవిధ్యం నష్టం అవుతుండటం, కాలుష్యం పెరుగడం వంటి అనేక సవాళ్లను ప్రపంచం ఎదురొంటున్నదని వివరించారు. ఈ సమస్యలకు పరిషారం శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో లేదని, ప్రతి వ్యక్తీ తన జీవన విధానంలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడంలో ఉన్నదని చెప్పారు. మొకలు నాటడం, నీటిని ఆదా చేయడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవడం, ప్రకృతి వనరులను జాగ్రత్తగా వినియోగించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేరొన్నారు. మొక నాటడం అన్నది మనకు చాలా చిన్న విషయంగా అనిపించవచ్చని, కానీ ఈ మొక నాటడం వెనుక మానవాళి మనుగడకు సంబంధించిన అత్యంత ప్రధానమైన సందేశం దాగి ఉన్నదని శుభాంశు శుక్లా అభిప్రాయపడ్డారు. అంతరిక్షం నుంచి చూసినప్పుడు భూమి ఒక స్వర్గం లాగా కనిపిస్తుందని, కానీ, మనం మాత్రం ఎకడో మరో స్వర్గం ఉన్నదని అనుకుంటూ దాని కోసం వెతుకుతూనే ఉన్నామని చెప్పారు.