హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలు శుక్రవారం 150 వార్డులలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని కాచిగూడలో ఏర్పాటు చేసిన వార్డు ఆఫీసును పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ తన స్వరూపాన్ని మరోసారి మార్చుకోనున్నదని తెలిపారు. వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మరింత వేగంగా పౌర సేవలు అందుతాయని వెల్లడించారు. పౌరులకు సేవలు అందించటమే కాకుండా, ప్రజా సమస్యలను వేగంగా పరిష్కారించేందుకు జీహెచ్ఎంసీ అధికారులకు వీలు కలుగుతుందని వివరించారు. వార్డు స్థాయిలో కార్పొరేటర్లు ఉన్నా, అధికార యంత్రాంగం లేదని.. అందుకే ఈ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. వికేంద్రీకరణ, ప్రజల కేంద్రంగా పాలనే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో కోటికిపైగా జనాభా ఉన్నదని, వీరందరికీ వార్డు కార్యాలయాల్లోనే కనీస పౌర సేవలు, ఫిర్యాదులు పరిష్కారం అవుతాయని వెల్లడించారు.
వార్డు కార్యాలయానికి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇన్చార్జిగా ఉంటారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ వార్డు కార్యాలయంలో పది మంది అధికారుల బృందం వివిధ శాఖల నుంచి పనిచేస్తుందని అన్నారు. రోడ్డు నిర్వహణ, పారిశుధ్యం, ఎంటమాలజీ, హరితహారం, టౌన్ ప్లానింగ్, విద్యుత్తు శాఖ, జలమండలి, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఇలా పది మంది అధికారులు వార్డు స్థాయిలో జరిగే ఆయా శాఖల కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని వివరించారు. భవిష్యత్తులో ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ తరఫున కూడా మరింత మంది అధికారులను వార్డు కార్యాలయానికి అనుసంధానం చేస్తామని తెలిపారు. పౌరుల సమస్యల పరిష్కారానికి నిర్ణీత గడువుతో కూడిన సిటిజన్ చార్టర్ ఇచ్చామని వెల్లడించారు. జవాబుదారీతనం, సుపరిపాలన కోసం సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని, వ్యక్తులు అశాశ్వతమని, వ్యవస్థ శాశ్వతమని నొక్కి చెప్పారు. తెలంగాణ ఎన్నో రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఇప్పుడు దేశం మొత్తం మనవైపు చూస్తున్నదని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని అధికారులకు సూచించారు. జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ వార్డు కార్యాలయాలను నియంత్రిస్తారని పేర్కొన్నారు.
వార్డు పాలన విజయవంతమైతే సుపరిపాలనలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలుస్తుందని, దేశం మొత్తం ఈ వ్యవస్థను అన్ని నగరాల్లో అమలు చేసే అవకాశాలుంటాయని కేటీఆర్ తెలిపారు. ఈ వ్యవస్థ కొత్తది అని, వీలైనంత త్వరగా సంపూర్ణంగా పనిచేసేలా చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, జలమండలి ఎండీ దాన కిశోర్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి, అదనపు కమిషనర్ వీ కృష్ణ, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.