హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అన్ని పండుగలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రతి ఏటా మాదిరిగా క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్ విందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్రిస్మస్ గిఫ్ట్‌ప్యాక్‌ల పంపిణీ, విందు ఏర్పాట్లపై గురువారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, నగర ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కొప్పుల సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దాదాపు 15 వేల మంది క్రైస్తవులకు ఎల్బీ స్టేడియంలో విందు ఏర్పాటు చేయనున్నామని.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, పలువురు క్రైస్తవ ప్రముఖులు పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా పేదలకు కొత్త బట్టలు, గిఫ్ట్‌ప్యాక్‌లను పంపిణీ చేయనున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చర్చిల్లో క్రిస్మస్ విందులు ఘనంగా నిర్వహించాలని అప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పా రు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, సాయన్న, ప్రకాశ్ గౌడ్, స్టీఫెన్సన్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్, మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు ఏకే ఖాన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.