రవీంద్రభారతి, ఏప్రిల్ 23: కుల, మతాలకు అతీతంగా సమాజ శ్రేయస్సుకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడి స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని స్త్రీశిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. భాషాసాంస్కృతిక శాఖ, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర 890 జయంతి ఉత్సవం ఆదివారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుతో కలిసి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. సమాజానికి మేలు చేసే వారు ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. బసవేశ్వరుడు, అంబేద్కర్‌ను ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చన్నారు. అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, బాబూ జగ్జీవన్‌రాం, బసవేశ్వర ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు. అనంతరం వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. సమాజంలోని అట్టడుగు ప్రజల ధర్మాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని సామాజిక కోణంలో ఆలోచించిన మహనీయుడు బసవేశ్వరుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, ముల్కాపురం శివకుమార్, సీఆర్ గౌరీశంకర్, వీర మల్లేశ్, నాగరాజు, సతీశ్‌కుమార్, సుభాష్ షేరికర్, సంగిశెట్టి మల్కాపురి, అరుణ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ తెలంగాణ భవన్లో ఘనంగా జయంతి
కుల, మత భేదాలు లేని సమాజ స్థాపనకు అవిరామంగా కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడు అని ఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ కొనియాడారు. సామాజిక వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది, వీరశైవ మత స్థాపకుడు మహాత్మ బసవేశ్వరుని 890వ జయంతి వేడుకలు ఆదివారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ అంబేడ్కర్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ.. మహాత్మ బసవేశ్వరుని జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఏటా అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.