Grama Sabhalu | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ఊరూరా జనాగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. కాంగ్రెస్ సర్కార్ తీరుపై పల్లెలు గర్జిస్తున్నాయి. అనర్హులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి అడుగులకు మడుగులొత్తేవారికే సర్కార్ పథకాలా? అంటూ నిరసిస్తున్నాయి. ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించిన గ్రామసభలు సర్కారు పనితీరుకు అద్దంపట్టాయి. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ సహా గ్రామసభల్లో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు సంధించిన ప్రశ్నల వర్షంతో వణికిపోయారు. మరోవైపు ప్రజల పక్షాన నిలదీసిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, నిరసన తెలిపిన ప్రజలను అధికార పార్టీ ఎమ్మెల్యే సహా కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడులు చేసి, బెదిరింపులకు గురిచేయటం వంటి సంఘటనలూ చోటుచేసుకున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ సర్కార్‌పై గ్రామసభల సాక్షిగా పల్లెలు తిరగబడుతున్నాయని తేటతెల్లమైంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధికోసమే కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారుల ఎంపిక పేరుతో డ్రామాలు ఆడుతుందని ప్రజలు నిర్ధారణకు వచ్చారు.
గ్రామాల్లో నిలదీతలు
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభలు రసాభాసగా మారాయి. ప్రభుత్వం ఆదివారం ప్రారంభించనున్న నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన గ్రామసభల సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిరసను ఎదుర్కొన్నది. ప్రభుత్వ పథకాలు అనర్హులకు అప్పగిస్తున్నారని, అందుకు ప్రభుత్వం సిద్ధం చేసిన జాబితాలే నిదర్శనమని వేలాది గ్రామాల్లో ప్రజలు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 800 గ్రామాల్లో కాంగ్రెస్ సర్కార్ ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. ఆ నిరసన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే అధికంగా వ్యక్తమైంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలో ఒకరు, జగిత్యాల జిల్లాలో మరొకరు ఆత్మహత్యయత్నానికి పాల్పడి సర్కార్‌పై తమ నిరసనను వ్యక్తం చేయటం విచారకరం. కొన్నిచోట్ల సెల్‌టవర్లు ఎక్కగా, పలువురు గ్రామపంచాయతీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తంచేశారు. గ్రామసభలు సాగిన ప్రాంతాల్లో పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటుచేశారు. పలుచోట్ల లబ్ధిదారుల కన్నా పోలీసులే అధికంగా కనిపించినా, సభ నిర్వహణను వీడియోగ్రఫీ చేసినా ప్రజలు ఎక్కడా తమ నిరసనను విరమించుకోలేదు.
మంత్రులకు నిరసన సెగ
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామసభలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆంథోల్ నియోజకవర్గం నేరేడుగుంటలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఇతర చోట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కంభంపాటి అనిల్‌కుమార్, వినోద్ తదితర ప్రజాప్రతినిధులు గ్రామసభల్లో ప్రజాగ్రహానికి గురయ్యారు. దీంతో ఆంధోల్ నియోజకవర్గంలోని నేరేడుగుంట గ్రామంలో 350 మందికి రుణమాఫీ జరగాల్సి ఉన్నప్పటికీ ఇంకా 127 మందికి పైగా రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉంది అని ప్రకటించారు.
గులాబీ దళం-ప్రజల పక్షం
గ్రామసభల సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీసిన వారిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు, కొన్నిచోట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి వారి నోరునొక్కే ప్రయత్నం చేయగా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వారికి అండగా నిలిచారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అయినా సరే గులాబీ దళం ప్రజలపక్షం వహించిందని గ్రామసభలు మరోసారి నిరూపించాయి. హన్మకొండ జిల్లా కమలాపూర్ నియోజకవర్గంలో గ్రామసభకు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు తమ వెంట కోడిగుడ్లను, టమాటాలను తెచ్చుకొని దాడికి పాల్పడ్డారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని ‘గ్రామసభల్లో గొడవచేస్తే, తోలుతీసి… చెట్టుకు కట్టేసి కొడ్తాం బిడ్డల్లారా’ అని హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, వారి అనుయాయులు చేసిన హూంకరింపులు, బెదిరింపులకు భయపడకుండా అన్నివేళలా అండదండగా ఉంటామని బీఆర్ఎస్ నిరూపించింది.
తీవ్ర నిరసనల చిట్టా..
రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని నాలుగు రోజుల గ్రామసభలు తేటతెల్లం చేశాయి. ఉమ్మడి జిల్లాల వారీగా నిరసన వ్యక్తమై న ఘటనల వివరాలు..