మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామసభలో పథకాల అమలులో పారదర్శకత పాటించడం లేదంటూ గ్రామస్థుల ఆందోళన, వేదిక వైపు దూసుకొస్తున్న ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులు ప్రజాపాలన, సంక్షేమ పథకాల అమలు కోసమంటూ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలు రణరంగాలన్ని తలపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించడం లేదంటూ జనం తిరుగుబాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ నిలదీస్తూ సభలను బహిష్కరిస్తున్నారు.
పోలీసుల పహారాలో ఇష్టమొచ్చిన పేర్లను చదువుతున్నారంటూ అన్ని జిల్లాల్లో మహిళలు, రైతులు, నిరుద్యోగులు, యువకులు ముక్తకంఠంతో నిలదీస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరిగే సభలను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. చాలా గ్రామాల్లో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామగ్రామాన పింఛన్ ఇప్పించాలని వేడుకునే అవ్వ, నిలువ నీడ కల్పించాలని వేడుకునే మహిళ, రైతు బంధు ఏమాయె సారూ అంటూ నిలదీసే అన్నదాతల ఆక్రందనలతో సభలన్నీ రసాభాసలుగా మారాయి. అరెస్టులు, బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తే లేదంటూ సబ్బండ వర్గాలకు బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు అండగా గళమెత్తారు.