కాంగ్రెస్ గ్యారెంటీల పుట్ట పగిలింది. అలవిగాని హామీలిచ్చి.. ఆనక వాటిని ఎగ్గొట్టి.. అమలు చేస్తున్న కొద్దిపాటి పథకాల్లోనూ కోతలు, కొర్రీలు పెడుతున్న రేవంత్ సర్కారు తీరుపై జనాగ్రహం పెల్లుబికింది. గ్యారెంటీలపై ఎవరిని అడగాలో తెలియక ఇన్నాళ్లూ వేచిచూసిన జనం.. గ్రామసభల్లో తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. రేషన్ కార్డులు, రైతుభరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన గ్రామసభల సాక్షిగా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. లబ్ధిదారుల జాబితాల్లో తమ పేర్లు ఎందుకు లేవంటూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలను ఎక్కడికక్కడ నిలదీశారు.
హైదరాబాద్, జనవరి 21 (నమస్తేతెలంగాణ) : మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వేల పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించగా, అన్నిచోట్లా సర్కారుపై ప్రజలు తిరగబడ్డారు. చాలచోట్ల ప్రజల నిలదీతలు, ఆందోళనలు, నిరసనలతో సభలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ముందస్తు సమాచారం లేక వెలవెలబోయాయి. దాదాపు అన్ని చోట్లా పోలీసులను మోహరించి ప్రజలపై ఉక్కుపాదం మోపుతూ సభలను మమ అనిపించడం కనిపించింది. అర్హులను వదిలేసి కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారినే పథకాలకు ఎంపిక చేశారని, ఇందిరమ్మ ఇండ్లకు ఒకే ఇంటి నుంచి ఇద్దరు, ముగ్గుర్ని ఎంపిక చేశారని, లేనివాళ్లను వదిలి ఉన్నోళ్లకే లబ్ధికలిగేలా జాబితాలు తయారు చేశారని అధికారులను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను నిలదీశారు. ఏ గ్రామ సభలో చూసినా సర్కార్‌పై ప్రజలు తమలో నిండిపోయిన తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కారు.
‘దరఖాస్తులు ఎప్పుడు తీసుకున్నారు? ఏ ప్రాతిపదికన అర్హుల జాబితా తయారు చేశారు. మాకు ఎందుకు ఇవ్వరు?’ అని ఎక్కడికక్కడ నిలదీయడంతో అధికారులు మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. జాబితాలో మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల పేర్లే ఉన్నాయంటూ అనేకచోట్ల అధికారులు, నేతలు, ప్రజల మధ్య వాగ్వాదం జరిగింది. మంచిర్యాల, సూర్యాపేట, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, జనగామ తదితర జిల్లాల్లోని పలు గ్రామాల్లో అధికారులపై ప్రజలు మూకుమ్మడిగా తిరగబడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో గుంట భూమిలేకున్నా ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు ఎందుకివ్వడంలేదని మహిళలు నిలదీశారు. ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని, ఆడబిడ్డలకు తులం బంగారం ఏదని? ఏడాదైనా రైతుభరోసా ఎందుకిస్తలేరని? ప్రశ్నల వర్షం కురిపించారు.
నాలుగు పథకాలకు కొత్తగా దరఖాస్తులు ఇవ్వాలంటూ అధికారులు పత్రాలు విడుదల చేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చామని, కులగణన సర్వేలో కూడా తమ వివరాలన్నీ చెప్పామని, తమకు సంబంధించిన అన్ని రకాల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని స్పష్టంచేశారు. మళ్లీ ఇప్పుడు ఎందుకు దరఖాస్తులు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయని నిలదీశారు. ఓట్లప్పుడు చెప్పినదానికి, ఇప్పుడు చేస్తున్నదానికి పొంతన లేదని అధికార పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. మార్పు అంటే ఇదేనా అని దెప్పిపొడిచారు.
భువనగిరి పట్టణంలోని 7వ వార్డు హనుమాన్‌వాడలో రేషన్‌కార్డు, ఇండ్ల కోసం డబ్బులు పెట్టి ఫారం కొనుక్కొని గంటల తరబడి లైన్లో నిలబడి వేచిచూసిన కొందరికి నిరాశే ఎదురైంది. సమయం అయిపోయిందని చెప్పి వారి దరఖాస్తులను అధికారులు తీసుకోకుండానే వెళ్లిపోయారు. అన్నం కూడా తినకుండా ఇక్కడే నిలుచున్నా దరఖాస్తులు తీసుకోలేదని వారంతా ఆవేదన వ్యక్తంచేశారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామంలో ఓ ఎస్సై అత్యుత్సాహం ప్రదర్శించాడు. గ్రామసభలో అర్హుల ఎంపిక సరిగ్గా లేదని ఓ యువకుడు ప్రశ్నిస్తుండగా ఎస్సై సంతోష్‌రెడ్డి కలగచేసుకుని ‘వీడు ఎక్కువ మాట్లాడుతున్నడు.. తీస్కపోయి లోపలేయండి’ అంటూ సిబ్బందికి హుకుం జారీచేశాడు. పోలీసుల ఓవరాక్షన్‌పై ఓ విలేకరి వీడియో తీస్తుండగా, అతడి ఫోన్ లాక్కొని దాడిచేసే ప్రయత్నం చేశారు. ఎస్సై దురుసు ప్రవర్తనను గ్రామస్తులు తప్పుపట్టారు. తమ గోడును వినిపించుకోకుండా తమపైనే దురుసుగా ప్రవర్తించటమేమిటని నిలదీశారు.
మహబూబాబాద్, జనవరి 21 : ‘రెండేండ్ల కింద చనిపోయినవారి పేర్లు, కోటీశ్వరుల పేర్లు జాబితాలో ఉన్నయ్. మొత్తం పేదలకు అన్యా యం చేసేటట్టు జాబితా తయారు చేసిండ్రు.. కార్యదర్శి, జీపీ సిబ్బంది తప్పతాగి ఇంట్లో ఉండి రాసుకున్న లిస్ట్ ఇది. ఇంటింటికీ తిరిగి సర్వే చేయలేయనే లేదు.. మళ్లీ గ్రామంలో రీ సర్వే చేసి అర్హులకు న్యాయం చెయ్యాలె’ అంటూ అధికారుల తీరుపై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిప్పులు చెరిగారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి సభలో ఇందిరమ్మ ఇంటి జాబితా చూసి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కూరెళ్లి సతీశ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. కోమటిపల్లికి చెందిన చెరుకు సంజీవ, మంకు యాకయ్య, మటత్తమ్మల్ అలివేలమ్మ ఏడాదిన్నర క్రితమే చనిపోయారని, వారి పేరిట కూడా ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేర్లు ఉన్నాయని, స్పెషల్ ఆఫీసర్, కార్యదర్శి, జీపీ సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని నిలదీశారు. వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
ఆమె ఒక దేశ్‌ముఖ్ వంశస్థురాలు.. నేటికీ లింగాలఘనపురంలో వారికి ఓ గడీ ఉన్నది. అందులో ఇటీవలే పర్ణశాలను తలపించేలా ఇల్లు నిర్మించుకున్నది. ఆమె కూడా ఇందిరమ్మ ఇల్లుకు అర్హురాలని జనగామ జిల్లా లింగాలఘనపురం గ్రామసభలో అధికారులు ప్రకటించడంతో గ్రామస్తులు విస్తుపోయారు. లింగాలఘనపురానికి చెందిన లింగాల సింధూ ఇందిరమ్మ ఇంటికి అర్హురాలని అధికారులు తేల్చేశారు. ఈ విషయంపై తహసీల్దార్ రవీందర్‌ను వివరణ కోరగా ‘లింగాల సింధూ నాకు బాగా తెలుసు.. వారికి ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా?’ అంటూ ఆశ్చర్యపోయారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలాపూర్‌లో ఆర్ఐ గంగారాజాకు, గ్రామస్తులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆర్ఐ మాట్లాడుతూ ‘ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇప్పుడే మొదలైంది. జాబితాలో పేర్లు వచ్చినోళ్లందరికీ వచ్చినట్టు కాదు. పేర్లు లేనోళ్లకు రానట్టు కాదు. ఇది కేవలం మొన్న చేసిన సమగ్ర సర్వే ప్రకారం వచ్చిన డాటా.. ఎవరిదైనా మిస్ అయ్యింది కావచ్చు. వందల పేర్లలో ఒక పేరు మిస్ అవ్వుద్ది. దీంతో అంతా అయిపోయినట్టు కాదు.’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో గ్రామస్థులు మండిపడ్డారు. ‘మళ్లీ అప్లికేషన్ పెట్టుకునేందుకు పైసలెవరు ఇస్తరు? పని చేసుకుంటూ బతికేటోళ్లం. ఇప్పటికే ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నం. మళ్లెందుకు దరఖాస్తు?’ అంటూ నిలదీశారు.
కమాన్‌పూర్ ఎంపీడీవో లలిత కాళ్లపై పడి ఓ మహిళ తనకు ఇల్లు కావాలని వేడుకున్నది. పెంచికల్పేటకు చెందిన గెళ్లేన లావణ్య,శేఖర్ దంపతులది నిరుపేద కుటుంబం. లావణ్య కూలీ పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు. లోతట్టు ప్రాంతంలో ఉన్న రేకుల షెడ్డులో ఉంటున్నారు. వానకాలం వస్తే వీరికి జాగారమే. ఇంట్లోకి నీళ్లు చేరుతయి. దీంతో గ్రామంలోని కమ్యూనిటీ హాల్లో తల దాచుకుంటరు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న లలిత, తమకు ఇల్లు వస్తదని సంబురపడ్డది. కానీ జాబితాలో ఆమె పేరు రాకపోవడంతో కన్నీరుమున్నీరైంది. తనకు ఎలాగైనా ఇల్లు ఇప్పించాలని ఎంపీడీవో కాళ్లపై పడి వేడుకున్నది.
‘కేసీఆర్ ఇచ్చినయన్న ఇత్తలేరు. బాకీ మాఫీ చేస్తమన్నరు.. చెయ్యలేదు’ అని నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో మహిళా రైతు ఏలేటి లింగుబాయి ఆవేదన వ్యక్తం చేసింది. రుణమాఫీ వచ్చిందికదా? అని అక్కడే ఉన్న ఓ కాంగ్రెస్ నాయకుడు అడుగగా ‘లిస్టు ఉన్నదిగద సూడుపో’ అంటూ ఆమె తీవ్ర అసహనం వ్యక్తంచేసింది.