Grama Panchayats | హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నెలలుగా నిధులు విడుదల చేయకపోవడంతో పల్లెలను నిధుల కొరత వేధిస్తున్నది. ఆదాయ వనరులు అంతగా లేని పంచాయతీల్లో కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొన్నది. దీంతో పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి అత్యవసర ఖర్చులకు సర్దుబాటు చేయాల్సి వస్తున్నది. అభివృద్ధి పనుల మాట దేవుడెరుగు.. కనీసం వేతనాలు, కరెంటు బిల్లులు, ఈఎంఐలకైనా నిధులు ఇవ్వండి మహాప్రభో అని వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నిధులు లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. చెత్త సేకరించే ట్రాక్టర్లకు కనీసం డీజిల్ కూడా పోసే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతున్నది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు దవాఖాన పాలవుతున్నారు. గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛదనం, పచ్చదనం, బతుకమ్మ, దసరా పండగ సంబరాలకు నిధుల లేమి సమస్యగా మారిందని పంచాయతీ కార్యదర్శులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అత్యంత ప్రాధాన్యమిచ్చింది. కేంద్రం నుంచి వచ్చే నిధులకు అంతే మొత్తంలో జమ చేసి నెలకు రూ.250 కోట్లకుపైగా గ్రామ పంచాయతీలకు విడుదల చేసేవారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు సాఫీగా జరిగేవి. గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో చూడముచ్చటగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. నిధుల విడుదల ఆగిపోవడంతో అన్ని పనులు బంద్ అయ్యాయి. గత పది నెలల్లో పంచాయతీలకు దాదాపు రూ.2,500 కోట్లు, ఉపాధి హామీ పథకం కింద దాదాపు మరో రూ.1,300 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉన్నదని మాజీ సర్పంచ్లు చెప్తున్నారు. తాము అనేకసార్లు ప్రభుత్వాన్ని, గవర్నర్ను, ప్రతిపక్షాలను కలిసినా ఫలితం లేదని మాజీ సర్పంచ్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులే చిన్నచిన్న పనులకు కూడా నిధులు లేకపోవడంతో వ్యక్తిగతంగా అప్పులు తెచ్చి పెడుతున్నారు. ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేస్తుంటే వాటిని ఎలా తీర్చాలోనని మధనపడుతున్నారు.
సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఫిబ్రవరి 2న ప్రత్యేకాధికారులను నియమించింది. నిధుల లేమి, సిబ్బంది జీతాల చెల్లింపుల్లో జాప్యం కారణంగా పంచాయతీ పాలన గాడితప్పుతున్నది. గ్రామాల్లో పారిశుద్ధ్యం పనుల కోసం బ్లీచింగ్ పౌడర్, చెత్త సేకరణ, మురుగు కాలువల్లో పూడికతీత, విద్యుత్తు దీపాల ఏర్పాటు, తాగునీటి పైప్లైన్ల లీకేజీలు, ట్రాక్టర్లకు డీజిల్ కొరత తదితర సమస్యలు రాజ్యమేలుతున్నా పట్టించుకునేవారు కరవయ్యారు. ప్రత్యేకాధికారులు సైతం చేసేదేమీ లేక పంచాయతీలను పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): రెండేండ్ల బీఈడీ కోర్సులో భారీగా సీట్లు మిగలడంతో మరో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఎడ్సెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ నేటి(సోమవారం)నుంచి ప్రారంభంకానున్నది. సోమవారం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశముండగా, సోమ, మంగళవారాల్లో వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 8న వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. 11న సీట్లను కేటాయింపు ఉంటుందని, 14 నుంచి 17 వరకు కళాశాలల్లో రిపోర్టు చేయాలని అధికారులు పేర్కొన్నారు.