ఆదిలాబాద్/నిర్మల్, మే 15: ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం కురిసిన వర్షానికి ధాన్యం తడిసిముద్దయింది. కడెం మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వడ్లు, ముథోల్ మండలంలో సజ్జ, మక్కజొన్న ఉత్పత్తులు తడిసి ముద్దయ్యాయి. దిలావర్పూర్ మండలంలోని నిర్మల్-భైంసా 61వ జాతీయ రహదారిపై చెట్లు నేలకొరిగాయి. తాంసి మండలంలో కోసిన నువ్వులు, జొన్న పంట తడిసింది.
బోథ్ మార్కెట్ యార్డుకు జొన్నలు అమ్మకానికి తెచ్చిన రైతులు వర్షంతో తంటాలు పడ్డారు. తూకం వేసి సంచుల్లో నింపిన, కుప్పలుగా పోసిన జొన్నలు తడవకుండా ఉండేందుకు అష్టకష్టాలు పడి టార్పాలిన్లు కప్పారు. మామిడి కాయలు నేలరాలాయి. ఇచ్చోడ మండలం ధర్మసాగర్ వెళ్లే మార్గంలో పెద్ద వృక్షం పడిపోవడంతో 108 అంబులెన్స్ సేవలు నిలిచిపోయాయి. ఇంద్రవెల్లి మండలంలోని పలు గ్రామాల్లో పలువురి ఇండ్ల పైకప్పులు, రేకులు ఎగిరిపడ్డాయి.