రాజన్న సిరిసిల్ల, జూన్ 17( నమస్తే తెలంగాణ)/సిరిసిల్ల టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా కేం ద్రం శివారులోని అపెరల్ పార్కు వర్క్ షెడ్లో నిల్వ ఉంచిన ధాన్యం మాయమైంది. సుమారు 150 నుంచి 200 వరకు బస్తాలు ఈ నెల 15న అర్ధరాత్రి దాటిన తరువాత అపహరణకు గురైనట్టు ఎస్‌డబ్ల్యూసీ మేనేజర్ విజయ్ సిరిసిల్ల ఠాణాలో ఈ నెల 16న ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, అపహరణకు గురైన ధాన్యం బస్తాలతో ఉన్న లారీని పట్టుకుని ఠాణాకు తరలించినట్టు తెలిసింది. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయమై పట్టణ సీఐ శ్రీనివాస్‌ను వివరణ కోరగా కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
అపెరల్ పార్కు గోదాంలో మాయమైన ధాన్యం బస్తాలలో 89 బస్తాలు కోనరావుపేట మండలంలోని ఓ గ్రామంలో లభించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదే మండలంలోని ఓ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ నేతనే అక్కడ ఐకేపీ సెంటర్ నిర్వాహకుడిగా నాలుగేండ్లుగా పనిచేస్తున్నాడు. గతంలోనూ ధాన్యం బస్తాల నిర్వహణలో అవకతవకలు జరిగినట్టు గ్రామంలో ప్రచారం జరుగుతున్నది. 89 బస్తాల ధాన్యం పోనూ మిగిలిన బస్తాలు ఎక్కడికి తరలించారో పోలీసుల విచారణలో తేలనున్నది. బుధవారం రాత్రి సిరిసిల్ల పోలీసులు ధాన్యం బస్తాల లారీని పట్టుకుని ఠాణాకు తరలించడం గమనార్హం. కాగా సదరు కాంగ్రెస్ నాయకుడిని కాపాడుకోవడానికి ఆ పార్టీ పెద్దలు రంగంలోకి దిగినట్టు తెలిసింది. పోలీసులు సైతం ఈ కేసును గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తున్నది.