(నమస్తే తెలంగాణ, న్యూస్‌నెట్‌వర్క్) : ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చిన తరువాత సర్కారు నిర్లక్ష్యం కారణంగా వర్షార్పణం అయింది. రైతుల నోటిగాడ ముద్ద నీళ్లపాలయింది. సోమవారం కురిసిన భారీ వర్షం రైతులకు తీరని కష్టాన్ని మిగిల్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట, లింగంపేట తదితర మండలాల్లో గంటకుపైగా వాన దంచికొట్టింది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. వర్షపు నీటి ఉధృతికి వడ్లు కొట్టుకుపోయాయి. సిద్దిపేట మారెట్ యార్డులోనూ వడ్లు, మొకజొన్నలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. నాలుగైదు రోజులైనా ధాన్యం కొనేవారు లేరని రైతులు కన్నీరు మున్నీరయ్యారు. చేతికి వచ్చిన పంట కళ్లముందే కొట్టుకుపోతుండటంతో.. రైతులు కన్నీళ్లు పెడుతూ, అచేతనులై చూస్తుండి పోయారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక పోవడంతోనే తమకీ దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు.ప్రభుత్వం వెంటనే వడ్లనుకొని ఆదుకోవాలని తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.