Telangana | హైదరాబాద్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను నిండా ముంచుతున్నది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆరుగాలం కష్టించి పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓవైపు ముంచుకొస్తున్న వర్షాలు, మరోవైపు కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, ఇంకోవైపు మిల్లర్ల దోపిడీతో రైతులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. రైతులు అష్టకష్టాలు పడుతుంటే ప్రభు త్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొనుగోలు కేంద్రాల జాడేది?
ఈసారి అక్టోబర్ 1 నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించినా.. అవన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఓ వైపు ధాన్యం కోతలు జోరందుకున్నా.. సివిల్ సైప్లె మాత్రం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు ఇప్పటివరకు వంద కూడా ప్రారంభించలేదని తెలిసింది. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి చేతులు దులిపేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి.
మిల్లర్ల దోపిడీ..
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ఇదే అదునుగా మిల్లర్లు దోపిడీకి తెరతీశారు. రైతుల బలహీనతలను అవకాశంగా మలుచుకొని తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం క్వింటాలు మద్దతు ధర రూ. 2320గా ఉన్నది. ఇక సన్నధాన్యానికి సర్కారు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ. 2820 ధర దక్కాలి. కానీ రైస్ మిల్లర్లు దొడ్డు ధాన్యానికి రూ. 1800 నుంచి రూ. 1900 వరకు చెల్లిస్తుండగా, సన్న ధాన్యానికి రూ. 2100-2300 వరకు చెల్లిస్తున్నారు. రైతులు ప్రతి క్వింటాకు దొడ్డు ధాన్యానికి రూ. 500 వరకు నష్టపోతుండగా, సన్న ధాన్యానికి రూ. 700 వరకు నష్టపోతున్నారు. దీంతో మద్దతు ధర దక్కక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టమని తెలిసినా మరో దిక్కులేకపోవడంతో రైతులు తమ ధాన్యాన్ని తక్కువ ధరకే మిల్లర్లకు అమ్ముకుంటున్నారు.
తుఫాను ముప్పు
రాష్ర్టానికి తుఫాను హెచ్చరికలు జారీ అయ్యాయి. వచ్చే వారం రోజుల్లో భారీ అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రైతుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. చేతికొచ్చిన పంట ఎక్కడ వర్షార్పణం అవుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో అకాల వర్షాలు మొదలయ్యాయి. అయినప్పటికీ ప్రభుత్వం నష్టనివారణ చర్యలపై దృష్టి పెట్టలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వేగంగా కొనుగోళ్లు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్ఫాలీన్లను ప్రభుత్వం ఇప్పటివరకు సరఫరా చేయలేదని తెలిసింది. ఈ విధంగా రైతులు కష్టాలు పడుతూ నష్టాలు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం, సివిల్ సైప్లె అధికారులు ఏమీ పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
క్వింటాకు 500 నష్టపోయాం
80 కిలోమీటర్ల దూరం నుంచి కిరాయి పెట్టి రెండు ట్రాక్టర్లలో ధాన్యాన్ని తీసుకొచ్చి మిర్యాలగూడలోని మిల్లులకు తీసుకొస్తే.. క్వింటా రూ.2,300 ధర పడింది. ప్రభుత్వం ఇస్తామన్న బోనస్‌తో కలిపి ఇస్తే రూ.2,820 వచ్చేవి. ఇప్పుడు క్వింటాకు రూ.500 నష్టపోయాను. అధికారులు ధాన్యం విక్రయాల వైపు చూసే పరిస్థితే లేదు.
– వెంకట్‌రెడ్డి, రైతు, అర్వపల్లి
తక్కువ ధరకే అమ్ముకున్న
నేను 45 క్వింటాళ్ల ధాన్యాన్ని రూ.2,350 లెక్కనే అమ్ముకున్నాను. ఎన్ని మిల్లులు తిరిగినా అంతా ఒకే రేటు అడిగారు. గతేడాది ఇదే రోజుల్లో క్వింటా రూ.2,600కి పైగా అమ్ముడుపోయింది. ఇప్పుడు మాత్రం ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. మిల్లులకు తెచ్చిన ధాన్యాన్ని వెనక్కి తీసుకొని పోలేక తప్పని పరిస్థితుల్లో తక్కువ ధరే అయినా అమ్ముకున్నాను. – జానయ్య, రైతు, నకిరేకల్
ఎన్నాళ్లీ కన్నీళు! కొనేవాళ్లు?
సోమవారం కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వడ్లరాసులు నీటిపాలయ్యాయి. ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేసినా, కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయ్యింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాల్లో, సిద్దిపేట మారెట్లో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. పలు జిల్లాల్లో చేతికందిన పంట వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.