నల్లగొండ సిటీ ఏప్రిల్ 29: ఒకవైపు కొనుగోళ్లు సాగక పేరుకుపోయిన ధాన్యపు రాశులు.. మరోవైపు ధాన్యం అన్లోడ్ చేయకుండా మిల్లర్ల వేధింపులు.. దిక్కుతోచని స్థితిలో నల్లగొండ జిల్లాలో ధాన్యం సేకరణ కేంద్రం ఇన్చార్జి ఆత్మహత్యకు యత్నించాడు. తన చావుతోనైనా వడ్ల కొనుగోళ్లు సజావుగా సాగాలని కోరుతూ ఆత్మహత్యాయత్నానికి ముందు ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది. పురుగు మందు తాగిన కనగల్ మండలం బచ్చన్నగూడెం పీసీసీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇన్చార్జి కొప్పుల సైదులు పరిస్థితి ఉన్నది. నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే బచ్చన్నగూడెంలో గత కొన్నిరోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. రైతులు నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవడం లేదు. బీగ్రేడ్ అంటూ ధాన్యాన్ని తిప్పిపంపుతుండటం, మరోవైపు రైతులు పంట కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తుండటంతో సైదులుపై తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.
‘కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలున్నయ్. ఎక్కడికక్కడ వడ్ల రాశులు పేరుకుపోయినయ్. రైతులు కొనుగోళ్లు చేయాలని అడుగుతున్నరు. కొన్న ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవడం లేదు. రవాణా సమస్యలూ ఉన్నాయి. నిన్న పంపిన రెండు లారీల ధాన్యాన్ని నాణ్యత లేదంటూ మిల్లర్లు తిప్పి పంపారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. రైతులతో సమన్వయం చేసుకోవాలని అంటున్నారే తప్ప ధాన్యం దిగుమతి సమస్య గురించి మాట్లాడటమే లేదు. నా చావుతోనైనా కొనుగోళ్లు సజావుగా సాగాలి’ అంటూ సెల్ఫీ వీడియోలో పేర్కొన్న అనంతరం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సైదులును స్థానిక రైతులు వెంటనే నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
సైదులుకు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పరామర్శ
నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న సైదులును నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి బుధవారం రాత్రి పరామర్శించారు. ఆయన కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నదని భూపాల్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ విమర్శించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చి నెల రోజులైనా ధాన్యం కొనేదిక్క లేదని తెలిపారు. ఇప్పటికైనా వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతులను అదుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులను వంచించిన సర్కార్ రైతు కిశోర్‌రావు ఆవేదన
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా మోసం చేసిందంటూ ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు ఆందోళన బాటపట్టాడు. తలమడుగుకు చెందిన కిశోర్‌రావు కలెక్టరేట్ ఎదుట దీక్షకు దిగాడు. ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డితోపాటు ఇతర నాయకులు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు.