Telangana | సూర్యాపేట, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ఇది ఓ కౌలు రైతు గుండెకోత.. ఐదెకరాల్లో అప్పుసప్పు చేసి పండించిన 70 బస్తాలను మార్కెట్లో అమ్మకానికి తెచ్చిండు.. ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.2,320 ఉంటే.. ఆ కౌలు రైతు ధాన్యానికి కేవలం రూ.1,606 పలికింది.. రైతు గుండె రగిలింది. పంటరాశికి నిప్పంటించి, అందులో దూకబోయాడు. పక్కనే ఉన్న తోటిరైతులు కాపాడి ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇది సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో శనివారం రాష్ట్రంలోని రైతుల దుస్థితికి దర్పణం పట్టిన ఘటన. సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన బత్తుల లింగరాజు గ్రామంలో 5 ఎకరాల్లో కౌలుకు వరిపొలం సాగుచేశాడు. అప్పులుచేసి సాగు చేయగా ఇటీవల చేతికి వచ్చిన 70 బస్తాల ధాన్యాన్ని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చాడు. వాస్తవానికి ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ.2,320 ఉండగా లింగరాజు ధాన్యానికి మాత్రం క్వింటాకు రూ.1,606 మాత్రమే పలికింది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని ఆవేదనకు లోనయ్యాడు. ఆగ్రహంతో తాను తీసుకొచ్చిన వరిధాన్యం రాశికి నిప్పంటించగా, పక్కనే ఉన్న రైతులు మంట అంటుకున్న కుప్పను పక్కకు నెట్టారు. ‘ఈ ధాన్యాన్ని కాపాడేది ఎందుకు? బీఆర్ఎస్ హయాంలో ఏనాడూ ఇలాంటి ధరలు రాలేదు.. అప్పులు తీర్చాలంటే పెండ్లాం పిల్లలను అమ్ముకోవడమో లేక నేను ఆత్మహత్య చేసుకోవడమో జరుగాలి’ అంటూ నిప్పంటించిన ధాన్యంలోకి లింగరాజు దూకబోగా రైతులు, మార్కెట్ సిబ్బంది వారించి బయటకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రైతు లింగరాజు తన ఆవేదనను వెళ్లగక్కాడు.
రెండు రోజులుగా తిండిలేదు: లింగరాజు
రెండు రోజులుగా అన్నం తినకుండా ధాన్యం రాశి వద్దే పడుకున్నాను.. అని కౌలురైతు లింగరాజు బోరున విలపిస్తూ చెప్పాడు. ఆరు నెలలు ఎంతో కష్టపడి పండించిన పంటకు ధర ఎక్కువ వస్తుందని సూర్యాపేట మార్కెట్కు తీసుకొస్తే ఖరీదుదారులు, కమీషన్దారులు, మార్కెట్ అధికారులు కుమ్మక్రై మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం మద్దతు ధర కూడా రాని ఈ ధాన్యం తగల పెడదామనే నిప్పంటించిన అని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే రైతులకు మేలు జరుగుతుంది.. ఈ కాంగ్రెస్ పార్టీతో ఏమీ కాదు.. అని ఆవేదనతో చెప్పారు. ధర తక్కువ వచ్చినట్టు తమ దృష్టికి వచ్చిందని, ధరపై పునఃసమీక్ష చేసి రైతు లింగరాజుకు న్యాయం చేస్తామని మార్కెట్ అధికారులు హామీ ఇచ్చారు.
చేతికందిన పంటలు బుగ్గిపాలు
ఇచ్చోడ (సిరికొండ), ఏప్రిల్ 11 : ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పు రవ్వలు ఎగిసిపడటంతో రైతులకు చెందిన పంటలు కాలిబూడిదయ్యాయి. ఈ ఘటన ఆదిలాబాద్ సిరికొండ మండలం కొండాపూర్ శివారు లో శుక్రవారం చోటుచేసుకున్నది. బాధిత రైతుల కథనం ప్రకారం.. సాయిని భూ మన్న, సాయిని స్వామి అన్నదమ్ములు. వీ రు నాలుగెకరాల్లో జొన్న, మక్క పంటలు సాగు చేశారు. సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద శుక్రవారం నిప్పు రవ్వలు ఎగిసిపడి జొన్నచేనుకు అంటుకున్నాయి. మంటలు వ్యాపించి కల్లంలో ఆరబోసిన మక్క పంట కూడా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సాయిని స్వామికి చెందిన రెండెకరాల జొన్న పంట విలువ రూ.2 లక్షలు, రూ.60 వేల విలువైన పైపులు దగ్ధంగా కాగా, భూమన్నకు చెందిన రెండెకరాల మక్క పంట దగ్ధమై రూ.లక్ష నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు.