మిర్యాలగూడ, ఏప్రిల్ 7: పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లోని మిల్లులకు ధాన్యం అక్రమంగా తరలివస్తున్నది. నిత్యం వందలాది వాహనాల్లో సన్న ధాన్యం వస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఫలితంగా తెలంగాణ ధాన్యం ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి ధాన్యం తరలివస్తున్నా ఇక్కడి అధికారులు ఏం చేస్తున్నారంటూ స్థానిక రైతులు మండిపడుతున్నారు. ఏపీలోని కర్నూలు, కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి తెలంగాణలోని మిర్యాలగూడకు రోజుకు సుమారు 500 డీసీఎంల ద్వారా ధాన్యం తరలివస్తున్నది. ఆంధ్రా నుంచి తక్కువ ధరకే ధాన్యాన్ని మి ల్లుల వద్దకు చేరుస్తున్నారు.
రూ.2, 200లకు క్వింటాల్ చొప్పున బస్తా సహా మిల్లులకు తీసుకొస్తున్నారు. స్థానిక రైతుల ధాన్యంలో పచ్చ గింజ, తాలు ఎక్కువగా ఉన్నదనే కుంటి సాకులు చెప్తూ ధర తగ్గిస్తున్నారు. గత 25 రోజులుగా ఏపీ నుంచి ధాన్యం రావడం ప్రారంభం కావడంతో ఒకేసారి క్వింటాల్‌కు రూ.250 చొప్పున ధర తగ్గించారు. మిల్లర్లంతా సిండికేట్‌గా మారి నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చినప్పటికీ పచ్చ గింజ శాతం, తాలు అధికంగా ఉన్నదని, చెత్త ఉన్నదంటూ సాకు లు చెప్తున్నారు. ప్రస్తుతం రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకునే పరిస్థితి లేకపోవడం, ధాన్యాన్ని యంత్రాల ద్వారా కోసినందున వెంటనే విక్రయించక తప్పడం లేదు. ఇదే అదునుగా మిల్లర్లు రైతులను బెదిరించి తక్కువకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
అక్రమ రవాణాను అడ్డుకోరా?
ఎంతో కష్టపడి పండించిన సన్న ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. ఏపీ నుంచి జోరుగా సన్నధాన్యం రావడం వల్లే ఇదంతా జరుగుతున్నదని ఇక్కడి రైతులు వాపోతున్నారు. ఆంధ్రా ధాన్యం రవాణా ప్రారంభమైన నాటి నుంచే క్వింటాల్‌కు రూ.250 నుంచి రూ.300 వరకు ధర తగ్గించి స్థానిక రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఏపీ నుంచి సన్న ధాన్యం క్వింటాల్‌కు రూ.2,200 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యానికి మంచి గిరాకీ ఉన్నది. డిమాండ్ ఆధారంగానే రైస్ మిల్లర్లు రైతుల నుంచి గత నాలుగేండ్లకుపైగా మద్దతు ధరకు మించి గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం ఇబ్బడిముబ్బడిగా వస్తుండటంతో మిల్లర్లు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించడం ఆనవాయితీగా మారింది. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో వేరే రాష్ట్రం నుంచి ధాన్యం జోరుగా రవాణా జరుగుతున్నదని, ఫలితంగా తమకు కోట్లాది రూపాయల నష్టం కలుగుతున్నదని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏపీ నుంచి వస్తున్న ధాన్యం రవాణాను అడ్డుకొని తమకు గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలని కోరుతున్నారు.
ఏపీ ధాన్యం వల్లే ధర తగ్గించిన్రు
ఆంధ్రప్రదేశ్ నుంచి మిర్యాలగూడలోని మిల్లులకు సన్న ధాన్యాన్ని డీసీఎం వాహనాల ద్వారా తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈ ధాన్యం వల్లే రైస్ మిల్లర్లు మా ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. మార్కెట్లో సన్న బియ్యం ధర క్వింటాల్‌కు రూ.5 వేలకుపైగా ఉన్నది. దీనిప్రకారం రైతులకు రూ.2,700కుపైగా గిట్టుబాటు ధర చెల్లించాలి. కానీ మిల్లర్లు రూ.2,400 నుంచి రూ.2,500 వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను దోచుకుంటున్నారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించి ఆదుకోవాలి.
-సైదులు, రైతు, మొల్కపట్నం, వేములపల్లి మండలం