ఏటూరునాగారం, మే 14 : అకాల వర్షానికి వరద ముంచెత్తడంతో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగుపల్లి రైతులు ఘెల్లుమన్నారు. నడి వేసవిలో ఊరవాగు ఉప్పొంగి రెక్కల కష్టాన్ని ఒక్క ఉదుటున తుడిచిపెట్టేయడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మంగళవారం రాత్రి దాకా ధాన్యం కుప్పల వద్దే కాపలా ఉన్న రైతులు.. తెల్లవారుజామున కురిసిన వర్షానికి వడ్లు, బస్తాలు కొట్టుకుపోవడం చూసి అన్నదాత గుండె చెరువైంది.
సుమారు 400 ఎకరాల్లో 30 మంది రైతులు సాగు చేసిన రెండు వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. ఇందులో కొంతమంది రైతులు ఆరబోసుకున్న ధాన్యం, కుప్పలు వరద పాలై కన్నీరు మిగిల్చింది. కొంతమంది విక్రయించేందుకు ధాన్యం ఉంచగా, మరికొందరు రైతులు విత్తన కంపెనీలకు అమ్మేందుకు నిల్వ చేసుకున్నారు.
దాదాపు 20 రోజులుగా అక్కడే..
ఊరవాగు సమీపంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో దాదాపు ఇరువై రోజుల క్రితం నుంచి రైతులు ధాన్యం ఆరబోసుకున్నారు. కొందరు బస్తాల్లో నింపుకొన్నారు. కాంటా అయి లోడింగ్ కాకుండా కొన్ని బస్తాలు అలాగే ఉన్నాయి. ఇదే సమయంలో బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రైతులు ఆరబోసుకున్న ధాన్యం కుప్పల్లోకి వరద చేరి తీరని నష్టం వాటిల్లింది. ఇప్పటికే అప్పుడప్పుడు కురుస్తున్న అకాల వర్షంతో రైతన్న కంటిమీద కునుకు లేకుండా చేస్తుండగా బుధవారం కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రంలో ధాన్యంపై వాగులా ప్రవహిస్తున్న వరదను చూసి రైతులంతా లబోదిబోమన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట కాస్త వాగు పాలు కావడంతో ఆవేదనచెందారు. వరదలో కొట్టుకుపోయిన ధాన్యం కన్పించకపోవడంతో కొందరు రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ వైపు క్వింటాకు ఆరు నుంచి పది కిలోల తరుగు తీస్తున్నారని, సకాలంలో ధాన్యం నింపుకొనేందుకు బస్తాలు కూడా సరిగా ఇవ్వడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దాదాపు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద విలయానికి రైతుల ఆశలు ఆవిరి కాగా రెక్కల కష్టం గంగపాలైందని పంట కోసం తెచ్చిన అప్పులు ఎలా కట్టాలని ఆవేదన చెందుతున్నారు.
రంగంలోకి దిగిన అధికారులు..
కొనుగోలు కేంద్రంలోకి వస్తున్న వరదను మళ్లించేందుకు రెవెన్యూ అధికారులు జేసీబీలతో మట్టితో కట్టలు వేయడం, కాల్వలు తీయించే ప్రయత్నం చేశారు. నీట మునిగిన కొనుగోలు కేంద్రాన్ని ఐటీడీఏ పీవో చిత్రమిశ్రా సందర్శించి రైతులతో మాట్లాడారు. నష్టపరిహారం అందించేందుకు సిఫారసు చేస్తామన్నారు. సాయంత్రంలోగా జరిగిన నష్టంపై అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. తక్షణ చర్యలు చేపట్టనున్నట్టు చెప్పి రోడ్డు, విద్యుత్తు సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గోగుపల్లిలో వాగు వరదతో ముంచెత్తిన కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గం ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్మన్ బడే నాగజ్యోతి సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
వర్షానికి తడిసిన ధాన్యం
అకాల వర్షం రైతన్నను వెంటాడుతున్నది. ఆరుగాలం కష్టాన్ని నీళ్లపాలు చేస్తూ అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. బుధవారం తెల్లవారుజామున కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో రైతన్న గగ్గోలు పెడుతున్నాడు. పెద్దపల్లి జిల్లాలో బలమైన ఈదురుగాలులుతో కురిసిన అకాల వర్షానికి తీవ్ర నష్టం జరిగింది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయి తీరని నష్టాన్ని మిగిల్చింది. పెద్దపల్లి మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.
పలుచోట్ల నీటిలో కొట్టుకుపోగా రైతులు పోగుచేసుకుని కుప్పలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక ఆలస్యంగా వరి సాగు చేసిన అందుగులపల్లి, అప్పన్నపేట, హన్మంతునిపేట, పెద్దకల్వల, పెద్దబొంకూర్, చీకురాయి, భోజన్నపేట గ్రామాల్లో కోతకు వచ్చిన పంట నేలవాలింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో వర్షానికి కరెంట్ వైర్ తెగి గొర్రెల మంద చుట్టూ ఉన్న ఇనుప కంచెపై పడటంతో 25 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిముద్దయింది. నష్టాన్ని అధికారులు గుర్తించి పరిహారం అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
రైతుల గగ్గోలు..
మంచిర్యాల జిల్లాలో భీమారం, చెన్నూర్ రూరల్, మందమర్రి, కన్నెపల్లి, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వర్షంతో ధాన్యం తడవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. వరద నీటికి ధాన్యం కొట్టుకుపోకుండా రైతులు కాపాడుకోడానికి ఇబ్బందిపడ్డారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంతోపాటు మస్కాపూర్, సుజ్జాపూర్, సత్తన్నపల్లిలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. ఆరబోసిన ధాన్యం, తూకం వేసి మిల్లులకు తరలించేందుకు సిద్ధం చేసిన ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోల్లు ఆలస్యంతో ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగితే లారీలు, హమాలీ కొరత ఉన్నదని, అన్లోడింగ్ ఆలస్యమవుతున్నదని చెబుతున్నారని తెలిపారు. గతంలో ఇచ్చినట్లు టార్పాలిన్ కవర్లు ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటవెంటనే ధాన్యాన్ని కొనాలని లేదంటే వర్షంతో మరింత నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
ఆర్మూర్‌లో రాస్తారోకో
వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆలూర్ ఎక్స్‌రోడ్డు వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా రోడ్లపైనే ధాన్యం వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీవో రాజాగౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించి, ఆందోళన విరమింపజేశారు.
ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యం
నేను రూ.లక్ష అప్పు తెచ్చి మూడు ఎకరాలు సాగు చేసిన. వాగు నడుము లోతుతో వరద పోతుంటే చూసి ఏం చేయలేకపోయాం. ఏడ్చుకుంటూ ఉన్నాం. పంటను నీటి పాలు చేశాం. తీరని నష్టం జరిగింది. మంత్రి సీతక్క స్పందించి మమ్మల్ని ఆదుకోవాలి. తక్షణమే సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారం చెల్లిస్తే అప్పులు కట్టుకుంటాం. భార్యాబిడ్డలను కాపాడుకుంటం. లేకుంటే ఆత్మహత్యే శరణ్యం. – పెంచికల లక్ష్మీ నారాయణ, రైతు, ఏటూరునాగారం
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటది మంత్రి సీతక్క
అకాల వర్షంతో తడిసిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు అందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. గోగుపల్లిలో వరదతో ముంచెత్తిన కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సందర్శించి రైతులు, అధికారులతో మాట్లాడారు. పంట నష్టపరిహారం ఎంతైనా చెల్లిస్తామని, నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. నష్టాన్ని అంచనా వేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.
ఇకనైనా కండ్లు తెరవండి
ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్‌రావు సూచన
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి సర్కారు ఇకనైనా కండ్లు తెరిచి దేశానికి అన్నం పెట్టే రైతుల బతుకులను కాపాడాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. తడిసిన ప్రతిగింజను కొంటామని ప్రభుత్వం భరోసా కల్పించాలని బుధవారం ‘ఎక్స్‘’ వేదికగా కోరారు.
‘కని, పెంచిన పిల్లలు కండ్లముందే కనుమరుగైనట్టు, ఇంటి దూలం విరిగి ఒకసారిగా భుజం మీద పడ్డట్టు, ఆరుగాలం శ్రమించి పండించిన పంట గాలివానకు తడిసి ముద్దయితే అన్నదాతకు ఎంత యాతన, ఎంత కడుపు కోత?’ అని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసినా రైతన్నల కన్నీటి గాథలే, ఎవరిని కదిలించినా కన్నీటి వేదనలేనని వాపోయారు. పోలీసు పహారా మధ్య కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమీక్షలు చేసే ముఖ్యమంత్రి ఇకనైనా కండ్లు తెరవాలని చురకలంటించారు.