MLC Elections | హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): పదిహేను నెలల పాలన పూర్తి చేసుకున్న రేవంత్‌రెడ్డి సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో పరాజయం పాలైంది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి పరాభవం చవిచూసింది. బుధవారం వెల్లడైన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఘోర ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్‌కు, పాలనలో విఫలమైన రేవంత్‌రెడ్డికి పట్టభద్రులు గట్టి సమాధానం చెప్పారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 54 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని, 2 లక్షలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో రాత పరీక్షలు నిర్వహించిన వాటికే నియామక పత్రాలు ఇచ్చి ఆ క్రెడిట్ కూడా తమదే అని రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారు. ఎమ్మెల్సీ స్థానం ఓడినా తమ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేం లేదని ప్రకటించారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతను గుర్తించినందువల్లే నైరాశ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు అదే నిజమైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తమ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన నాయకుడే ఓడినా పర్వాలేదనడంతో ఎన్నికల ముందే ఓటమిని ఒప్పుకున్నారని చర్చ నడుస్తున్నది.
ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల నియామకాలకు సంబంధించి కొన్ని లెక్కలు చెప్పారు. తాను చెప్పింది అబద్ధమైతే ఓటు వేయొద్దని, నిజమని నమ్మితేనే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. రేవంత్‌రెడ్డి చెప్పిన లెక్కలు చూసి చాలామంది పట్టభద్రులే ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరీ ఇంతలా అబద్ధాలు చెప్పడమేంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
అదే ఆగ్రహాన్ని ఓటింగ్‌లో చూపించారని విశ్లేషకులు చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన 12 నెలల్లో బీసీ కులగణన పూర్తి చేశామని సీఎం చెప్పినా.. బీసీలెవరూ కాంగ్రెస్‌ను నమ్మలేదని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయని బీసీ సంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్‌లో ఆయన ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారని ఫలితాల సరళిని బట్టి తేలిపోయిందని చెప్తున్నారు. అధికారంలో ఉండి కూడా మూడు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ ఓడిపోవడం ఆ పార్టీ పాలనా వైఫల్యానికి రెఫరెండంలా భావించాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 5: కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గపు ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్య ఓట్లతో ఆయన గెలుపొందారు. రెండు రోజుల పాటు జరిగిన కౌంటింగ్ ప్రక్రియ అడుగడుగునా ఉత్కంఠ రేపింది. బీజేపీ-కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ‘నువ్వానేనా’ అన్నట్టుగా గెలుపు దోబూచులాడింది. ఉమ్మడి నాలుగు జిల్లాల్లో పట్టభద్రుల స్థానానికి మొత్తం 2,52,029 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 28,686 ఓట్లు చెల్లలేదు.
వీటిలో 75,675 బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి, 70,565 కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి, 60,419 ఓట్లు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు వచ్చాయి. నిబంధనల ప్రకారం మొదటి ప్రాధాన్యతలోనే 1,11,672 ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటించాలి. కానీ మొదటి ప్రాధాన్యంలో ఏ అభ్యర్థికి కూడా అన్ని ఓట్లు రాలేదు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కించారు. మొత్తం 56 మంది పోటీచేయగా, రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించేందుకు గాను 54 మందిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. చివరకు బీజేపీ అభ్యర్థికే అత్యధిక ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు రాకపోయినా 5వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యం ఉండడంతో మూడో ప్రాధాన్యానికి వెళ్లకుండా అంజిరెడ్డి గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. కాగా, గెలుపుపై ఎంతో ధీమాతో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, ఊహించిన దానికి భిన్నంగా ఫలితం వెలువడడంతో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.