సిద్దిపేట : చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డిని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి హరీష్రావు (Harish Rao) ఉద్యోగులకు పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేట కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ను అధికారం నుంచి దించడానికి ఒక గంట అదనంగా పని చేయాలని రేవంత్ (Revanth) ఉద్యోగులను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. మొదటి సంతకంతో రైతుల రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేశారని, రైతులకు రూ.15, 000 రైతు భరోసా, రూ. 4000 ఆసరా పెన్షన్(Pension) , రూ.2,500 మహిళలకు ఇస్తామని అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను మోసం చేశారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్న రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు అమలు చేయడం లేదు ప్రశ్నించారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీ ఎందుకు మర్చిపోయావని నిలదీశారు. ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే అరెస్టు చేయడం ప్రజాస్వామ్యమా అంటూ మండిపడ్డారు. వెంటనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను పిలిచి మాట్లాడాలని డిమాండ్ చేశారు.
ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తా . ఒక కేసు కాదు లక్ష కేసులు పెట్టినా నీ పేరు ఎగవేతల రేవంత్ రెడ్డి అని అంటానని వెల్లడించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గురుకుల పాఠశాలలో విషాహారం తిని 49 మంది విద్యార్థులు చనిపోవడం బాధాకరమని హరీష్రావు అన్నారు. విద్యారంగంలోనూ బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ఆరోపించారు. ప్రజలను ముంచి విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామని స్పష్టం చేశారు.