హైదరాబాద్, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్(వర్క్) గ్రేడ్-2 పోస్టుల భర్తీకి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ వచ్చేనెలలో నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ శుక్రవారం ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నవంబర్ 8 నుంచి 11వరకు ఉదయం 10:30 గంటల నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నది. వివరాలకు వెబ్సైట్ https:// www.tspsc.gov.in చూడాలని సూచించింది.
ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్, అక్టోబర్11 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీనవర్గాలు, బీసీ విద్యార్థుల కోసం జాతీయస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలుచేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి శుక్రవారం బహిరంగ లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో బీసీ సంఘాల పోరాటంతో దాదాపు 1500 లకుపైగా గురుకులాలు అందుబాటులోకి వచ్చాయని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కూడా అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. ఏటా దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు.